హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులోవాదనలు ముగిశాయి. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీలోని రెండు గుర్తింపు సంఘాలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.

అయితే..రేపు ఆర్టీసీ జాక్‌ ఇందిరా పార్క్‌ దగ్గర దీక్షకు దిగుతుంది. ఈ దీక్షకు కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. ఇది ఇలా ఉంటే..సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు

అయితే..అంతకు ముందు ప్రభుత్వం తరపు న్యాయవాదులు, పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సమ్మెను తక్షణం విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కమిటీ వేశామని కోర్ట్‌కు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కమిటీ దఫదఫాలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపిందని కూడా తెలిపారు.  కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగాలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహిస్తున్నారని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పీవీ కృష్ణయ్య పిటిషనర్ తరపు న్యాయవాది

సమ్మె వెంటనే ఆపించాలని కోర్టును కోరినట్లు పీవీ కృష్ణయ్య తరపు న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం మాత్రం సమ్మెపై ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందన్నారు. ఆర్టీసీ 10వేల బస్సులు నడిపిస్తే..ప్రభుత్వం 11వేల బస్సులు నడిపిస్తామని చెప్పిందన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులపై చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందన్నారు. సమ్మె విరమణపై ఏం చేయలేమని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపిందన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.