సడలింపుల్లేవ్.. మే 7 వరకు లాక్‌డౌన్
By తోట వంశీ కుమార్
రాష్ట్రంలో కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వీటితో కలిపి తెలంగాణ రాష్ట్రంలో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 21 మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యువాత చెందారన్నారు. 186 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 651 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్నింటికి సడలింపులు ఇచ్చినప్పటికి.. రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి సడలింపులు లేవన్నారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు అలాగే కొనసాగుతాయని, మే 1 వరకు కొత్త కేసుల సంఖ్య తగ్గే పరిస్థితి లేదన్నారు. మే 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని, మే 5న అప్పటి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఎలాంటి కాల పరిమితి లేదు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల బ్యాంక్ ఖాతాల్లో వేసిన డబ్బులు తీసుకోవడానికి ఎటువంటి కాల పరిమితి లేదని పేర్కొన్నారు. కానీ, కొంతమంది కావాలని పుకార్లు పుట్టిస్తూ, అమాయక ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని వెల్లడించారు. బ్యాంకుల్లో వేసిన డబ్బులను త్వరగా తీసుకోవాలని, లేకపోతే.. వెనక్కి వెళ్లిపోతాయని అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని దీని వల్ల ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి.. మీ చుట్టు ప్రజలకు నిజాలను చెప్పండి. బ్యాంకుల్లో పడిన డబ్బులు తీసుకోవడానికి ఎలాంటి కాలపరిమితి లేదని వారికి తెలియజెప్పాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఆన్‌లైన్ పుడ్ డెలివరీ సంస్థలు బంద్..
రేపటి నుంచి మే 7 వరకు ఆన్‌లైన్ పుడ్ డెలివరీ సంస్థలకు రాష్ట్రంలో అనుమతి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ 15 రోజులు బయటి పుడ్ జోలీకి వెళ్లకండి. ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. ఎలాంటి పండుగలనైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసం అయినప్పటికి ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతులు లేవని, అన్ని మతాల్లో సామూహిక ప్రార్థనలు, కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు.
ఎవరైనా ఇబ్బంది పెడితే.. 100కి కాల్ చేయండి..
మూడు నెలలపాటు ఇంటి అద్దెలు వసూలు చేయొద్దని ఆదేశిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ 3నెలల కిరాయి వడ్డీ లేకుండా తర్వాత వాయిదాల వారీగా చెల్లించొచ్చని సీఎం చెప్పారు. కిరాయి కోసం ఓనర్లు ఇబ్బంది పెడితే డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లు 2020-21 ఏడాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచకూడదని, నెలవారీగా మాత్రమే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.