తెలంగాణలో 14 కరోనా పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2020 2:12 PM GMT
తెలంగాణలో 14 కరోనా పాజిటివ్‌ కేసులు

కరీంనగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం ముగిసింది. అత్యతున్నత స్థాయి సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తెలంగాణలో 14 కరోనా పాజిటివ్‌ కేసులను నయోదయ్యాయని అన్నారు. బాధితులంతా విదేశాలనుంచి వచ్చినవారేనన్నారు. మార్చి 1 తరువాత విదేశాల నుంచి వారి వివరాలను రెండు మూడు రోజుల్లో గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. థియేటర్స్‌, మాల్స్ మూసివేతను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమంతిచవద్దని ఆదేశాలిచ్చామన్నారు. ఉగాది, శ్రీరామనవమి వేడుకలను రద్దు చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించబోమని స్పష్టం చేశారు. ఉగాది పంచాంగ శ్రవణంను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని.. ప్రజలు ఇళ్లలో నుంచే వీక్షించాలని సూచించారు.

పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. ఆయా కేంద్రాల వద్ద శానిటైజేషన్ పాటించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వారిలో కరోనా ఉండే అవకాశం ఉన్నందున జాతీయ, రాష్ట్ర రహదారుల వద్ద మొత్తం 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిత్యావరసరాలు అందించే దుకాణాలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. షాపుల్లోకి ఒకేసారి ఎక్కువ మంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దుకాణదారులదేనన్నారు. గుంపులు గుంపులుగా ప్రజలు గుమిగూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫంక్షన్‌ హాళ్లు అన్నీ మూసివేయాలని పోలీసులను ఆదేశించాం. అయితే.. మార్చి 31 వరకు పెళ్లిళ్లకు అనుతించాం గనుక ఆవేడుకల్లో 200మందికి మించకుండా రాత్రి 9లోపు పెళ్లి తంతు ముగించాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉందని, ప్రజలు సహకరించి నియంత్రణ పాటించాలని కోరారు. ఎక్కువ మంది గుమిగూడకపోవడమే శ్రేయస్కరం. మన రాష్ట్రాన్ని, పిల్లలను కాపాడుకొనేందుకు అందరం జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపారు.

Also Read
Next Story