లాక్ డౌన్ కొనసాగాలి..ఆర్థిక చక్రం కదలాలి : ప్రధానికి జగన్ విజ్ఞప్తి

By రాణి  Published on  11 April 2020 12:17 PM GMT
లాక్ డౌన్ కొనసాగాలి..ఆర్థిక చక్రం కదలాలి : ప్రధానికి జగన్ విజ్ఞప్తి

ముఖ్యాంశాలు

  • రాష్ట్రంలో 37 రెడ్ జోన్లు, 44 ఆరెంజ్ జోన్లు
  • వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అనుమతివ్వాలి
  • ఆక్వారంగాన్ని ఆదుకోవాలి
  • సీఎంలతో ప్రధాని కాన్ఫరెన్స్ లో జగన్

రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తూ.. సహాయం అర్థించేవారి కోసం మానవతా దృక్పథంతో స్పందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. శనివారం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం జగన్..రాష్ట్రంలో కరోనా నివారణకై తీసుకుంటున్న చర్యలను ప్రధానికి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.4 కోట్ల కుటుంబాల ఆరోగ్య పరిస్థితిని ప్రతి నిత్యం క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామని చెప్పిన జగన్..కరోనా లక్షణాలున్నవారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఇంటింటి సర్వేలో భాగంగా 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశా వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారని, 3000 మంది వైద్యులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. అలాగే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 141 ప్రాంతాలను గుర్తించి..వాటిని కంటైన్మెంట్ చేశామన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎవరూ బయటికి రాకుండా నిత్యావసరాలను నేరుగా ఇళ్లకే పంపిస్తున్నామని ప్రధానికి వివరించారు సీఎం జగన్.

కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు కేటాయించిన ఆస్పత్రుల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నామని, క్రిటికల్ కేర్ కోసం మరో నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు, జిల్లాకొక కరోనా కేర్ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ మోదీకి తెలిపారు. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంట్లలో 26 వేల పడకలు సిద్ధం చేసినట్లు వివరించారు. లాక్ డౌన్ సామాన్యులపై, రాష్ట్రంపై చాలా ప్రభావం చూపిస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను జగన్ ప్రధానికి తెలిపారు.

మనదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక వ్యవసాయానిదే. జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాధి కల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే. అలాంటి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా లాక్ డౌన్ కారణంగా గణనీయంగా పడిపోయింది. చెక్ పోస్టులలో వాహనాలను సీజ్ చేస్తారన్న భయంతో 75 శాతం ట్రక్కులు, లారీల రాకపోకలు ఆగిపోయాయన్నారు. అన్ని రకాల పంటలు చేతికొచ్చే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడం వల్ల చాలా నష్టపోతున్నామన్నారు. ఈ సమయంలో వచ్చే వ్యవసాయ ఉత్పత్తులను భద్ర పరిచేందుకు, నిల్వచేసేందుకు సరిపడా గోదాములు కూడా లేవని చెప్పిన జగన్..మార్కెట్లు బంద్ అవ్వడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, మామిడి..నిత్యావసరాలైన కూరగాయలను వీలైనంత త్వరగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటన్నింటినీ కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ.. కొన్నవాటన్నింటినీ స్థానికంగానే ఉపయోగించలేమన్నారు. కేవలం పంటలే కాకుండా ఆక్వా రంగం కూడా ఎగుమతులు లేక తీవ్రంగా నష్టపోతోందని జగన్ వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే లక్షలాది మంది రైతులు, ఆక్వారంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని..వారిని ఆదుకోవాలంటే వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

దీర్ఘకాలం పాటు కరోనాపై పోరాడాలి

పారిశ్రామిక రంగం విషయానికొస్తే 1,03,986 యూనిట్లకుగానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయన్నారు. ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఉద్యోగులు లేకుండా కంపెనీలు నడపలేనపుడు ఉద్యోగులకు లాక్ డౌన్ రోజుల్లో జీతాలు చెల్లిస్తాయని ఆశించలేమన్నారు. రోడ్డు, రైల్వే రవాణాల వ్యవస్థ పూర్తిగా ఆగిపోవడంతో రాష్ట్రానికి కనీస ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొందని, సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడిందన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారన్నారు.

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలి..కానీ అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం కూడా ముందుకు కదలాలని జగన్ అభిప్రాయాన్ని ప్రధానితో పంచుకున్నారు. 1918లో వచ్చిన ఫ్లూ వ్యాధి కూడా దేశంపై 2 ఏళ్లకు పైగా ప్రభావం చూపించిందని, దానిని పరిగణలోకి తీసుకుంటే మనం దీర్ఘకాలం పాటు కరోనాపై పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ఉన్న 676 మండలాలకు గాను 81 మండలాల్లో కరోనా కేసులున్నాయన్నారు. వీటిలో 37 మండలాలు రెడ్ జోన్, 44 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని చెప్పిన జగన్..595 మండలాల్లో ఒక్క కరోనా కేసులు లేదని తెలిపారు. కేవలం రెడ్ జోన్లుగా ఉన్న మండలాల వరకే లాక్ డౌన్ ను కొనసాగించాల్సింది జగన్ కోరారు. అలాగే ప్రజలు సమూహాలుగా తిరిగే మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజా రవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న ఆంక్షలనే కొనసాగించాలన్నారు. లాక్ డౌన్ కొనసాగింపు లేదా ఎత్తివేతపై ప్రధాని సూచించే సూచనల మేరకు నడుచుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story