సాయంత్రం జగన్ మీడియా సమావేశం.. కీలక ప్రకటన.?
By తోట వంశీ కుమార్ Published on 26 March 2020 12:58 PM IST
కరోనా వైరస్(కొవిడ్-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. సహాయ చర్యలపై ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే దేశం మొత్తం లాక్‌డౌన్ ఉండటం, ఏపీలో కూడా సర్వం బంద్ అయ్యాయి. ఈ క్రమంలో నిత్యావసర సరకుల రేటులు ధరలను వ్యాపారులు భారీగా పెంచేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే జనాలు, విద్యార్థులు రాష్ట్ర సరిహద్దుల దగ్గరే ఆగిపోయి.. నానా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం మీడియా మీట్‌లో వీరిని ఉద్దేశించి కూడా జగన్ ప్రసంగిస్తారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 332 మంది నమూనాలు పరీక్షించగా 289 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 33 మంది రిపోర్టుల కోసం రావాల్సి ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. సాయంత్రం జగన్ కీలక ప్రకటన చేయనున్నరాని తెలుస్తోంది. ఆ ప్రకటన ఏమై ఉంటుంది..? ఏం ప్రకటించబోతున్నారు..? అనేదానిపై ఏపీ ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిత్యావసర సరకుల పంపిణీ, నగదు పంపిణీ, వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై కూడా జగన్ మాట్లాడబోతున్నారని తెలుస్తోంది.