ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి గడగడలాడిస్తుంది. ఈ వైరస్‌ భారిన పడి 50వేలకు పైగా మంది చనిపోగా.. 10లక్షల మంది ఈ వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని దేశాల్లో సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌లు విధించాయి. ప్రజలెవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ప్రతీ నిత్యం ప్రజలను కరోనా వైరస్‌ భారి నుండి రక్షించుకొనేందుకు ప్రభుత్వాలు, వైద్యులు, ప్రముఖులు కీలక సూచనలు చేస్తున్నారు. తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం, మొఖంపై చేతులు పెట్టుకోకూడదంటూ పలు సూచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో మానవులు ప్రతీ నిత్యం ఉపయోగించే సెల్‌ఫోన్‌ పట్లకూడా జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండటంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఎక్కువ శాతం మంది సోషల్‌ మీడియాలో వీడియోలు చూడటం, చాటింగ్‌లు చేయడం, సినిమాలు చూడటం నిత్యం ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు.

Also Read :రూ. 1.25 కోట్ల విరాళం అందజేసిన బాలయ్య

ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్‌నూ శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో మీ ఫోన్‌ను శుభ్రం చేసుకోవటం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు. ఫోన్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా సూచిస్తున్నారు. ముందుగా ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేయాలి. అనంతరం దానిపై ఉన్న పౌచ్‌ తొలగించాలి. ఫోన్‌ను శుభ్రం చేయడానికి ఎలాంటి రసాయనాలు, హ్యాండ్‌ జెల్‌ వంటి వాటిని వినియోగించొద్దు. గరుకుగా ఉండే వస్త్రాలను వాడొద్దు. వాటితో ఫోన్‌ తెరకు రక్షణగా ఉండే పైపొర దెబ్బతింటుంది. సాధారణ సబ్బు, నీళ్లను ఫోన్‌ శుభ్రం చేసుకొనేందుకు వినియోగించాలి. లేదా 70శాతం ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌తో కూడిన ద్రావణాలను ఉపయోగించి ఫోన్‌ స్క్రీన్‌, వెనుక భాగాన్ని శుభ్రం చేసుకోవాలి, అలా కాకపోయిన మార్కెట్లో కొన్ని యాంటీ బ్యాక్టీరియా వైప్స్‌ లభిస్తాయి. వీటితో కూడా స్మార్ట్‌ ఫోన్‌లను శుభ్రం చేసుకోవచ్చు.

Also Read :రోగ నిరోధక శక్తిని పెంచుతున్న వ్యాక్సిన్‌.. ఇక మనుషులపై ప్రయోగమే తరువాయి..

ఇక మొబైల్‌ ఫోన్‌కు ఉపయోగించే పౌచ్‌ (కేస్‌)లను ఒకటి కంటే ఎక్కువగా అందుబాటులో ఉంచుకోవడం మంచిది. బయట నుంచి వచ్చిన తర్వాత ఫోన్‌ పౌచ్‌ను తొలగించి మరో పౌచ్‌ను ఉపయోగించడం ద్వారా పౌచ్‌పై చేరుకున్న క్రిములు ఇతరులకు అంటుకోకుండా చూసుకోవచ్చు. ఫోన్‌ను కాస్త నీటిలో తడిపిన మృదువైన వస్త్రంతో జాగ్రత్తగా తుడవాలి. ఈ సమయంలో ఫోన్‌ లోపలికి ఎలాంటి తడి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చివరికి పొడి క్లాత్‌తో ఫోన్‌ను అన్నివైపులా తుడుచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌ను చార్జింగ్‌ పెట్టి క్లీన్‌ చేయాలని చూడకూడదు. ఆ తరువాత సూక్ష్మ క్రిముల కదలికలను చూపించే సంబంధించిన రీడింగ్‌ పరికరాన్ని తీసుకోవాలి.  ఫోన్‌ను దూదితో రుద్దాలి. ఆ దూది ఉన్న పుల్లను రీడింగ్‌ యంత్రంలో పెట్టుకోవాలి. రీడింగ్‌ ఎంత ఎక్కువ ఉంటే క్రిములు అంత ఎక్కువగా ఉన్నట్లు లెక్క. రీడింగ్‌ 50 లేదా అంతకంటే తక్కువ ఉంటే మంచిది. ఇలా మీరు నిత్యం ఉపయోగించే ఫోన్‌ను శుభ్రం చేసుకోవడం ద్వారా ఫోన్‌ ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్