ప్రముఖ బ్యాంకును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్లరికల్ మిస్టేక్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 11:33 AM GMT
ప్రముఖ బ్యాంకును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్లరికల్ మిస్టేక్

ఒక క్లరికల్ మిస్టేక్.. ఒక ప్రముఖ బ్యాంకు మెడకు చుట్టుకొని విలవిలలాడుతోంది. బ్యాంకింగ్ ప్రముఖుల మాటల్లో చెప్పాలంటే.. ఈ శతాబ్దంలోనే అత్యంత ఖరీదైన తప్పుగా అభివర్ణిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది చేసిన పొరపాటు విలువ ఏకంగా రూ.6700 కోట్లు కావటం గమనార్హం.

సిబ్బంది చేసిన తప్పును సరిచేసుకోవటంలో సదరు బ్యాంకు కిందామీదా పడుతోంది. తమ బ్యాంకు ఖాతా నుంచి పొరపాటున వెళ్లిన ఈ భారీ మొత్తాల్ని వెనక్కి తెచ్చుకోవటం ఇప్పుడా బ్యాంకుకు తలకు మించిన భారంగా మారింది. ప్రఖ్యాత సిటీబ్యాంక్ లో చోటు చేసుకున్న ఒక చిన్న తప్పు.. ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకోవటమే కాదు.. దాని నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక తల పట్టేసుకున్న పరిస్థితి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కరోనా నేపథ్యంలో ప్రఖ్యాత సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్ సుమారు బిలియన్ డాలర్ల మేర బకాయి పడింది. దీంతో.. ఆ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు గరం గరంగా ఉన్నాయి. న్యాయపోరాటానికి దిగాయి. సదరు సంస్థ తీసుకున్న రుణాల్ని 2023లోగా చెల్లించాలని కోరాయి. ఇదిలా ఉండగా.. సిటీ బ్యాంకు సిబ్బంది పొరపాటున రెవ్లాన్ కంపెనీ ఖాతాలో వేయాల్సిన రూ. 6700 కోట్ల మొత్తాన్నిపొరపాటున ఆ సంస్థకు అప్పుగా ఇచ్చిన సంస్థల ఖాతాలో వేశారు.

తప్పు దొర్లిన తర్వాత అసలు విషయాన్ని గుర్తించారు. ఇదిలా ఉంటే.. రెవ్లాన్ నుంచి రావాల్సిన మొత్తం కాస్తా బ్యాంకు నుంచి రావటంతో వారిప్పుడు బ్యాంకు ఖాతా నుంచి తప్పుగా పడిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఇదిలా ఉంటే.. రెవ్లాన్ మాత్రం తన ఖాతాలో వేయాల్సిన మొత్తాన్ని తనకు ఇవ్వాల్సిందిగా సిటీబ్యాంక్ ను డిమాండ్ చేస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెవ్లాన్ కు అప్పు ఇచ్చిన సంస్థలు స్పందిస్తూ.. తమకు రావాల్సిన అసలు రాలేదని.. ఇప్పుడు తమ అకౌంట్లో పడిన డబ్బులు వడ్డీకి సమానమని పేర్కొంటున్నారు. దీంతో.. ఈ వ్యవహారం మరింతగా ముదిరింది. ఈ శతాబ్దంలోనే అతి పెద్ద తప్పిదంగా బ్యాంకింగ్ వర్గాల వ్యాఖ్యానిస్తున్నాయి. మరీ.. కష్టం నుంచి సిటీ బ్యాంకు ఎలా బయటపడుతుందో చూడాలి.

Next Story