చర్చిలో తొక్కిసలాట.. 20 మంది మృతి
By సుభాష్ Published on 3 Feb 2020 4:41 PM ISTఓ చర్చిలో తొక్కిసలాట జరిగి 20 మంది వరకు మృతి చెందారు. టాంజానియాలోని కిలిమంజారో పర్వతం సమీపంలోని మోషే పట్టణంలో జరిగిన ఈ ఘటన విషాదాన్ని నింపింది. మోషే పట్టణంలో పాస్టర్ బోనిఫేస్ మంపోసా ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనలకు భారీగా క్రైస్తవులు హాజరయ్యారు. ఫాస్టర్ చేతిలో నూనెను పట్టుకుని ప్రార్థనలు చేయించి, నేలపై పోశాడు. పవిత్రమైన ఈ నూనెలో నడిస్తే మంచి జరుగుతుందని చెప్పడంతో, జనాలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 20 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, తొక్కిసలాట జరుగుతున్నా.. క్రైస్తవ మత ప్రబోధకుడు ఏమాత్రం పట్టించుకోకుండా టాంజానీయ తీర నగరం దాస్ ఇస్‌సలేం పట్టణంలోని మరో చర్చిలోకి వెళ్లిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫాస్టర్లు ప్రజల అనారోగ్యాన్ని అదనుగా చేసుకుని మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
సువార్త సభల పేరుతో..
ఇక సువార్త సభల పేరుతో మనీ ల్యాండరింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం దక్షిణాఫ్రికాని ఓ చర్చిలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై చర్చి ఫాస్టర్ షెఫర్డ్ బుషీరిపై కేసు నమోదైంది. ఆఫ్రికాలోనే అత్యంత ధనవంతుడుగా ఆయనకు పేరుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయనపై పలు కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి తన ప్రత్యేక విమానంలో అక్రమంగా డబ్బులు తరలించి పలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సమాచారం.