ఢిల్లీ: చిరంజీవి మనసులో ఏదో ఉంది. కాని ..బయటపడటంలేదు. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్‌కు మాత్రం దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ నేతలతో కలిసి కనిపించడం మానేసి చాలా ఏళ్లు అవుతుంది. ఖైదీ నెంబర్150, సైరా నరసింహ రెడ్డి అంటూ చిరంజీవి సినిమాల్లో బిజీ అయిపోయారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అందరూ ఊహించినట్లుగానే సైరా నరసింహరెడ్డి చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో చిరంజీవికి ప్రాణంలేచి వచ్చినట్లైంది.

‘సైరా నరసింహ రెడ్డి’ రిలీజ్ అయ్యి విజయం సాధించినప్పటి నుంచి చిరంజీవి పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. అందరూ అనుకునేది ఏమంటే ‘సైరా నరసింహరెడ్డి’ సినిమా ప్రమోషన్ కోసం కలుస్తున్నారని అనుకుంటున్నారు. మొదట తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కలిశారు. ఇరు కుటుంబాలు ‘సైరా’ సినిమాను చూశాయి. తమిళి సై కరుడుగట్టిన బీజేపీ నాయకురాలు. తమిళనాడులో బీజేపీ బలంగా లేకపోయినప్పటికీ…బీజేపీని బలోపేతం చేయడానికి ఆమె అలుపెరగని ఒంటరిపోరాటం చేశారు. తమిళి సై సేవలను గుర్తించి బీజేపీ ఆమెను తెలంగాణకు గవర్నర్‌గా పంపింది. తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని గట్టి పోరాటం చేస్తున్న భారతీయ జనతాపార్టీ తన మనిషిని హైదరాబాద్‌లో దింపిందనే చెప్పాలి. తమిళి సై గవర్నర్‌గా వచ్చిన కొన్ని రోజులకై టీఎస్ఆర్టీసీ సమ్మె మొదలైంది. 12 రోజులుగా కొనసాగుతుంది. మంగళవారం గవర్నర్ తమిళి సైని పిలుపించుకుంది కేంద్రం. అయితే..అందరూ సమ్మె గురించి ఆరా తీయడానికి అనుకున్నారు. అది ఒకందుకు అయినప్పటికీ…మరో కోణంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలంటే ఏం చేయాలి అని తమిళి సైని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. అందుకు ఆమె చిరంజీవి గురించి ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పినట్లు సమాచారం.

గవర్నర్‌ తమిళి సైని కలిసిన తరువాత చిరంజీవి సతీసమేతంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఇక్కడ కూడా లాజిక్ ఉంది. వైఎస్ జగన్ బీజేపీ అధిష్టానంతో చాలా మంచి సంబంధాలు నెరుపుతున్నారు. మోదీ, అమిత్ షాల విశ్వాసాన్ని పొందాడు. దీంతో..వైఎస్ జగన్‌ను  చిరంజీవి కలిసి తన మనసులో మాట బయట పెట్టినట్లు అమరావతి పొలిటికల్ టౌన్‌లో టాక్‌.  దీంతో ..వైఎస్ జగన్ కూడా బీజేపీ పెద్దలను కలవడానికి తన వంతు సాయం చేస్తానని చిరుకు హామీ ఇచ్చినట్లు వైఎస్ఆర్ సీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

ఇలా..తమిళి సై, వైఎస్ జగన్ లను కలిసిన తరువాతనే చిరుకు అమిత్ షా అపాయింట్ ఖరారైందని చెబుతున్నారు. ఇక..ప్రధాని మోదీ కూడా అపాయింట్ మెంట్ ఇస్తారని సమాచారం. సో..చిరంజీవి బీజేపీకి ఎంత దగ్గర కావడంలేదని ఖండించినా మారుతున్న రాజకీయ పరిణామాలు మెగాస్టార్‌ను కమలదళానికి దగ్గర చేస్తున్నాయని చెప్పుకోవచ్చు.

దీనిలో భాగంగానే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దగ్గరుండి చిరంజీవిని ఢిల్లీ తీసుకెళ్లారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెంకయ్యతో చిరు భేటీ అయ్యారు. వీరిద్దరూ..మరికొంత మంది కేంద్రమంత్రులతో చిరు ‘సైరా’సినిమా చూస్తారు. అనంతరం..అమిత్ షా, మోదీలతో భేటీ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి చిరంజీవి మరోసారి సొంత పార్టీతో కాకుండా..కమలం పార్టీతో ప్రజల ముందుకు వచ్చే అవకాశముందన్న మాట. ఇదే జరిగితే…జనసైనికులు ఏమైపోతారు..?!.ఎటూ ఉంటారో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.