సీఎం జగన్‌ను కలవనున్న చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం
By సుభాష్
టీడీపీ సీనియర్ నేత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, తనయుడు వెంకటేష్ ఈ రోజు ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్నారు. చీరాల నుంచి ర్యాలీగా వెళ్లనున్న బలరాం.. తనయుడు వెంకటేష్‌తో కలిసి వైసీపీలో చేరనున్నారు. కాగా, కరణం బాటలోనే మాజీ మంత్రి పాలేటి రామారావు, ఇతర టీడీపీ నేతలు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి బాలినేని సమీక్షంలో బలరాం సీఎం జగన్‌ను కలవనున్నారు.
కాగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహం మొదలైంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇలా వైసీపీలోకి వలసలు మొదలు కావడం, తాజాగా బలరాం కూడా వైసీపీలో చేరుతుండటంతో చంద్రబాబుకు గట్టి ఎదురదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే పలువరు కీలక నేతలు పార్టీని వీడారు.
కాగా, గత ఎన్నికల్లో అమంచికృష్ణ మోహన్‌పై కరణం బలరాం చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చీరాలకు బలరాం నాన్‌లోకల్ అయినప్పటికీ కృష్ణమోహన్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే గొట్టిపాటి రవిని టీడీపీలో చేర్చుకున్ననాటి నుంచి బలరాం పార్టీతో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించముందే బలరాం మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీని వీడాలని బలరాం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇక పులివెందులలో జగన్‌పై పోటీ చేసిన సతీష్‌రెడ్డి కూడా సైకిల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మార్చి 13న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరు వైసీపీలో చేరుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.