నేను 'కరోనా' రాక్షసితో పోరాడుతోన్నా.. తల్లి,కూతుళ్ల ఆవేదన.. కళ్లు చెమ్మగిల్లిస్తోన్న ఘటన.!

By అంజి  Published on  9 Feb 2020 5:33 AM GMT
నేను కరోనా రాక్షసితో పోరాడుతోన్నా.. తల్లి,కూతుళ్ల ఆవేదన.. కళ్లు చెమ్మగిల్లిస్తోన్న ఘటన.!

చైనాలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరీ ముఖ్యంగా హుబెయ్‌ ప్రావిన్స్‌లో ఎక్కువగా విజృంభిస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కరోనా వైరస్‌ బారిన 34,598 మంది పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 806కు చేరింది. 6,109 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం ఒక్కరోజే కరోనా వైరస్‌ కారణంగా 82 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 28 దేశాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. చైనాలో ఇద్దరు తొలిసారిగా వైరస్‌ బారిన పడి మృతి చెందారు. ఒకరు అమెరికన్‌ కాగా మరోకరు జపాన్‌కు చెందిన వ్యక్తి. కరోనా వైరస్‌తో పోరాడుతున్న చైనాకు అగ్రరాజ్యం అమెరికా 100 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది.

చైనాలో వైరస్‌ కారణంగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వైరస్‌ బాధితులు కోలుకోవడానికి వైద్యులు, నర్సులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కనీసం సొంత వారిని చూసేందుకు సైతం వారికి సమయం దొరకడం లేదు. కరోనా వైరస్‌ రోగులకు సేవ చేయడంతోనే రోజంతా గడిచిపోతోంది. దీంతో వారు తమ సొంత ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు. ఇంటికి వెళ్తే.. తమ కుటుంబ సభ్యులకు ఈ వైరస్‌ సోకుతుందనే భయంతో నర్సులు, వైద్యులు ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నారు. తాజాగా కరోనా వైరస్‌ బాధితులకు సేవలు అందిస్తున్న ఓ నర్సు.. తన కూతురికి దూరం నుంచే హగ్‌ ఇస్తూ, మనోవేదనకు గురవ్వడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. రోజుల తరబడి ఆస్పత్రిలోనే బాధితులకు సేవలు అందిస్తున్న నర్సుకు ఆమె కూతురు ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకువచ్చింది.

ఆస్పత్రి దగ్గర అమ్మను చూసిన ఆ చిన్నారిని ఒక్కసారిగా ఏడ్చేసింది. అయితే అక్కడి అధికారులు వారిద్దరిని వైరస్‌ సోకుతుందనే భయయంతో దగ్గరగా కలుసుకోనివ్వలేదు. దీంతో తల్లి, కూతుళ్లిద్దరూ కొద్ది దూరం నుంచే మాట్లాడుకున్నారు. అమ్మా నిన్ను మిస్‌ అవుతున్నాను అంటూ ఆ చిన్నారి ఏడ్చింది. దీంతో తల్లి.. అమ్మ రాక్షసులతో పోరాడుతోంది. వైరస్‌ తగ్గిపోగానే ఇంటికి వస్తుందని తెలిపింది. అనంతరం ఇద్దరు గాల్లోనే హగ్‌ చేసుకున్నారు. చిన్నారి తీసుకువచ్చిన ఆహారాన్ని ఫుట్‌పాత్‌పై పెట్టింది. ఆతర్వాత తల్లి ఆహారాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళ్లిపోయింది. అయితే ఈ సంఘటనను అక్కడున్న కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు.

Next Story