'కోవిడ్‌' దెబ్బకు చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ వాయిదా

By అంజి  Published on  18 Feb 2020 7:05 AM GMT
కోవిడ్‌ దెబ్బకు చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ వాయిదా

కమ్యూనిస్టు చైనాకు వార్షిక కాంగ్రెస్ చాలా ముఖ్యం. పార్టీ విధానాలు ఈ కాంగ్రెస్ సమావేశాల్లోనే తయారవుతాయి. ఎవరు రాజులో, ఎవరు తరాజులో నిర్ణయమయ్యేది ఇక్కడే. ఏడాది పాటూ దేశపు గతి, గమనం ఈ సమావేశాల్లోనే రూపు దిద్దుకుంటుంది. అలాంటి కీలక కాంగ్రెస్ సమావేశాలు ఈ ఏడాది జరగకపోవచ్చు.. లేదా వాయిదా పడొచ్చు.

ఎందుకంటే కోవిడ్‌ ప్రస్తుతం కమ్యూనిస్టు పట్టుదలను కూడా ఓడించేసింది. నానాటికీ వికరాళ రూపాన్ని దాలుస్తున్న కోవిడ్‌ దాడికి దేశమంతా విలవిల్లాడుతోంది. అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. క్షణక్షణానికీ కొత్త మరణాలు నమోదవుతున్నాయి. రోగులను వేరు చేయడం, వారికి ట్రీట్ మెంట్ ఇవ్వడం, చికిత్సలో ఉన్న వారికి తగిన సాయం అందించడం, వ్యాధినివారణ వ్యవస్థలను పటిష్టం చేయడం ఇప్పుడిదే చైనాకు ప్రాథమ్యం. అందుకే ముందు కోవిడ్‌ను జయించాకే కమ్యూనిస్టు కాంగ్రెస్ సమావేశాలుండవచ్చునని చైనా గురించి అధ్యయనం చేస్తున్నవారు చెబుతున్నారు. వుహాన్, తదితర నగరాలు దయ్యాల పేటలుగా మారిపోయాయి. ఎవరికి వారు ఇళ్లకు పరిమితమై కూర్చున్నారు. ఒక్క సోమవారం నాడే 2048 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 105 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో చైనాలో కోవిడ్‌ ముందు, కమ్యూనిజం తరువాత అన్న ఆలోచన బలం పుంజుకుంది.

కమ్యూనిస్టు కాంగ్రెస్ లో పాల్గొనాల్సిన 3,000 మంది డెలిగేట్లలో కనీసం వేయి మంది వ్యాధిగ్రస్త ప్రాంతాలకు చెందిన వారే. కాబట్టి వారు సహాయక చర్యల్లో పాల్గొని తీరాలి. మరో వైపు ప్రభావిత ప్రాంతాల నుంచి డెలిగేట్లు వస్తే వారి నుంచి వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 న చైనా పార్టీ నేతలు సమావేశమై కాంగ్రెస్ ను వాయిదా వేసే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అన్నీ సజావుగా ఉంటే కాంగ్రెస్ మార్చి 5 న జరగాల్సి ఉంది.

మరో వైపు చైనా ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం ఇప్పటికి 10,844 మంది కోవిడ్‌ వ్యాధిన బారిన పడి, చికిత్స పొంది, ఆరోగ్యవంతులై డిశ్చార్జి అయ్యారు. ఇప్పటికి చనిపోయిన వారి సంఖ్య 1,770 కి పెరిగింది. ఇదిలా వుండగా వుహాన్ లో వైరస్ పై యుద్ధానికి చైనా సైన్యం మరో 1,200 మంది డాక్టర్లు, నర్సులను ఆ నగరానికి పంపించింది. దీంతో ఒక్క వుహాన్ నగరంలోనే కోవిడ్‌ పై యుద్ధం చేసేందుకు 32,000 మంది సిబ్బందిని మొహరించినట్టైంది. ఇప్పటికి చైనాలో 70,548 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికభాగం వుహాన్ లోనే నమోదయ్యాయి.

Next Story