తగ్గుతోన్న కరోనా కేసులు..

By రాణి  Published on  20 Feb 2020 7:12 AM GMT
తగ్గుతోన్న కరోనా కేసులు..

చైనాలోని వుహాన్ నగరం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. మంగళవారం వరకూ కాస్త ఆందోళన కలిగించిన కరోనా కొత్త కేసుల నమోదు సంఖ్య..బుధవారం గణనీయంగా తగ్గింది. చైనా దేశ వ్యాప్తంగా 394 కొత్త కేసులు నమోదవ్వగా..ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 74,756కు చేరినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. బుధవారం 114 మంది కరోనా బాధితులు మృతి చెందగా..ఒక్క హుబెయ్ ప్రావిన్స్ లోనే 108 మంది వైరస్ కు బలయ్యారు. ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 2,118కి చేరింది.

ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 90 శాతం కోవిడ్ 19 కేసులు హుబెయ్ ప్రావిన్స్ లోనే గుర్తించారు వైద్యులు. బుధవారం నమోదైన కేసుల సంఖ్య కన్నా..కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్యే ఎక్కువ ఉందని తెలిపింది డబ్ల్యూ హెచ్ ఓ. హాంకాంగ్ లో 65 మందికి కోవిడ్ సోకగా..ఇద్దరు మృతి చెందారు. మకావ్ లో 10, తైవాన్ లో 24 కేసులు నమోదయ్యాయి. జపాన్ కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ప్రయాణించిన వారిలో ఇద్దరు వైరస్ సోకి మృతి చెందినట్లు అక్కడి మీడియా పేర్కొంది. బుధవారం నౌకలో ఉన్నవారందరినీ అధికారులు విడిచిపెట్టగా..621 మందికి కోవిడ్ 19 ఉన్నట్లు నిర్థారించారు అధికారులు.

Next Story