చైనా ఉక్కు పిడికిలిలో హంకాంగ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 4:26 PM GMT
చైనా ఉక్కు పిడికిలిలో హంకాంగ్..!

హాంకాంగ్‌ కోసం చైనా అంతగా ఎందుకు వెంపర్లాడుతోంది? హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని బతక నివ్వకూడదని ఎందుకు అనుకుంటోంది? ఇప్పటి నుంచే ఆ నగరాన్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడా నికి ఎందుకు ఆరాటపడుతోంది..?

బంగారు బాతు గుడ్డు కథ మనకు తెలిసిందే. చైనాకు, హాంకాంగ్‌ కూడా అలాంటిదే. చైనా ఆర్థిక అవసరాలను తీర్చడంలో హాంకాంగ్‌దే ప్రధాన పాత్ర. ఇన్ని రోజులు ఆ బంగారు గుడ్లపై ఆధారపడిన చైనా, ఇప్పుడు ఏకంగా బాతునే కోసుకు తినాలనుకుంటోంది. అందుకే ..హాంకాంగ్‌పై పెత్తనం సాధించాలని ఉవ్విళ్లూరు తోంది. నయానా భయానో హాం కాంగ్ ప్రజలను తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని తహతహలాడుతోంది. ఆందోళనలు ఎంతకీ తగ్గకపోవడంతో ఇప్పుడు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. యుద్ధ ట్యాంకులను కూడా మోహరించింది. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా జిన్‌పింగ్ ప్రభుత్వం లెక్కచేయడం లేదు. హాంకాంగ్ ఎక్కడ తమ పట్టు నుంచి జారిపోతుందో అనే టెన్షన్‌ చైనాలో పెరిగిపోతోంది. ఈ భయాలు, ఆందోళనలకు ఒకే ఒక్క కారణం ఆర్థిక అవసరాలు. ప్రపంచ తయారీదారుగా పేరొందిన చైనా పరిస్థితి ఇప్పుడు దిగజారింది. తయారీ తగ్గిపోయి ఉత్పత్తి మందగించింది. పన్నుల భారం పెరిగి ఎగుమతులు క్షీణించాయి. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడి వృద్ధి రేటు 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే చైనా ముందున్న ఏకైక మార్గం... హాంకాంగ్‌పై పట్టు సాధించడం. అందుకే సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తోంది.

హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ:

హాంకాంగ్‌ మొదటి నుంచి ఆర్థికంగా సుసంపన్నమైన నగరం. ఇక్కడి ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపార వాతావరణం కారణంగా పశ్చిమ దేశాలు పెట్టుబడుల వరదను పారించాయి. ప్రపంచంలో అతిపెద్ద స్టాక్‌ మార్కెట్లలో హాంకాంగ్‌ మార్కెట్‌ ఒకటి. చైనా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద దేశేతర మార్కెట్‌ హాంకాం గే. ప్రపంచ దేశాలకే అప్పులు ఇచ్చే ఆ బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో 7శాతం ఈ ఒక్క నగరంలోనే ఉన్నాయంటే ఎంత వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో కొన్ని సంస్థల ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్‌లోనే ఉన్నాయి. చైనా కంపెనీలకు హాంకాంగ్‌ చాలా ఇంపార్టెంట్ ప్లేస్‌. పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు ఉన్న హాంకాంగ్‌లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి చైనా కంపెనీలు ఇష్టప డతాయి. చాలా కంపెనీలు ఇక్కడి స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, క్నుక్‌ వంటి దిగ్గజాలు ఇక్కడే ఉన్నాయి. 2015 నుంచి హాంకాంగ్‌లో ఐపీవోలకు వచ్చిన చైనా కంపెనీలు 100 బిలియన్‌ డాలర్లకు పైగా సేకరించాయి. చైనాలో సేకరించిన మొత్తంలో ఇది 80శాతానికి సమానం. తాజాగా విదేశీ పెట్టుబడిదారులు హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ ద్వారా షాంఘై మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేసే అవకాశం కల్పించారు. డాలర్ల మార్పిడికి హాంకాంగ్ అడ్డా. హాంకాంగ్‌ కరెన్సీ విలువ డాలర్‌కు దాదాపు సమానంగా ఉంటుంది. దీంతో చైనీయులు తమ యువాన్లను డాలర్లలో మార్చుకోవడానికి హాంకాంగ్‌లోని బీమా ఉత్పత్తులను వాడుకుంటారు. క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేసి చైనా నిబంధనలను బైపాస్‌ చేస్తుంటారు. పైగా చైనా విదేశీ పెట్టుబడుల్లో అత్యధికం గా హాంకాంగ్‌కే వెళ్తాయి. 2017 చివరినాటికి ఇవి 981 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

చైనా అభివృద్ధిలో హాంకాంగ్ పాత్ర:

చైనాకు ప్రధాన ఆర్థిక వనరు హాంకాంగే. హాంకాంగ్‌ ఆదాయం, పరపతి నుంచి చైనా భారీగా లబ్ధిపొందింది. చైనా కంపెనీలకు విదేశీ నిధులు ఇక్కడి నుంచే వెళ్తాయి. చైనాలో నగదు కొరతను ఎదుర్కొంటున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, స్థానిక ప్రభుత్వ ఆర్థిక సంస్థలు హాంకాంగ్‌ నుంచి రుణాలు తెచ్చుకొంటాయి. అవే రుణాలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిందే. ఇప్పుడు హాంకాంగ్‌ చేజారితే చైనాకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

హాంకాంగ్‌ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులకు టారిఫ్‌ విధించకుండా అమెరికా మినహాయింపు ఇచ్చింది. చాలా చైనా కంపెనీలు ఇప్పుడు హాంకాంగ్‌ నుంచే ఎగుమతులు చేస్తున్నాయి. ఐతే, ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆందోళనలు ఎగమతులపై ప్రభావం చూపుతు న్నాయి. చైనా కంపెనీలకు మంచి మార్కెట్‌ విలువను ఇచ్చే హాంకాంగ్‌ సూచీలు వేగంగా పడిపోతున్నాయి. ఇది డ్రాగన్‌లో ఆందోళన పుట్టిస్తోంది. పైగా త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 0.5శాతానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ వృద్ధి రేటు. హాంకాంగ్‌ ఆర్థిక మాంద్యంలోకి జారితే చైనా ఆర్థిక వ్యవస్థకు భారీగా దెబ్బతగులుతుంది. అందుకే, హాంకాంగ్‌లో ఘర్షణనలు అదుపు చేయడం ఇప్పుడు చైనాకు అత్యవసరం.

హాంకాంగ్ పోరాటం-అమెరికా దుర్నీతి:

హాంకాంగ్ పోరాటాన్ని అమెరికా తనకు అనువుగా మార్చుకుంటోంది. చైనాతో వాణిజ్యయుద్ధంలో బేరాలాడడానికి హాంకాంగ్‌ను పావుగా మార్చుకుంటోంది. హాంకాంగ్‌లో దుస్సాహనికి పాల్పడితే చైనాతో వాణిజ్య ఒప్పందం ఉండదని ఇప్పటికే ట్రంప్‌ హెచ్చరించారు. దాంతో చైనా పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. అందుకే షాంఘై, షెన్జన్‌ నగరాలకు పశ్చిమ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. కానీ, ఇది రాత్రికి రాత్రే జరిగే పని కాదు.

Next Story