చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఈ ఒక్క రోజే..
By సుభాష్ Published on 11 May 2020 7:28 PM ISTకరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో కాస్త తగ్గుముఖం పట్టి మళ్లీ విజృంభిస్తోంది కరోనా. సోమవారం ఒక్క రోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. చైనాలోని ఈశాన్యంలోని జిలిన్ ప్రావిన్స్‌లోని షూలర్ నగరంలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతతో ఆ నగరాన్ని లాక్‌డౌన్ చేశారు. ఆదివారం ఒక్క రోజే ఆ నగరంలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసులన్నీ ఓ దోబీ మహిళకు లింకై ఉన్నట్లు గుర్తించారు. దోబీ వృత్తి చేపట్టే 45 ఏళ్ల మహిళ మొదట ఆమె భర్తకు..సోదరులకు, ఆ తర్వాత ఫ్యామిలీ సభ్యులందరికీ ఈ మహమ్మారి బారిన పడ్డారు. వాస్తవానికి ఆమెకు ఎటువంటి ట్రవెల్ హిస్టరీ లేదని అధికారులు గుర్తించారు.
చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. దాదాపు 200లకుపైగా దేశాల్లో ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాపించి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌తో చైనాలో శవాల దిబ్బగా మారిపోయింది. తర్వాత ఇటలీలో కూడా తీవ్రంగా విజృంభించి మరణ మృదంగం మోగించింది. ఇప్పుడు తాజాగా అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం పెద్దన్న డొనాల్డ్ ట్రంప్‌ను సైతం కంటినిండ కునుకులేకుండా చేస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో మరణాలు, పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇక భారత్‌లో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడంతో ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కరోనా తాకిడి పెద్దగా లేదు. చైనాలో పూర్తిగా తగ్గుముఖం పట్టి.. లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ విరుచుకుపడుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు మొదలు కావడంతో మరింత ఆందోళనకు గురి చేస్తోంది.