వుహాన్ నగర శివారులో..రికార్డు సృష్టించిన చైనా

By రాణి  Published on  3 Feb 2020 5:19 AM GMT
వుహాన్ నగర శివారులో..రికార్డు సృష్టించిన చైనా

కరోనా...ఇప్పుడు ప్రపంచ దేశాల్ని భయంకరంగా వణికిస్తోన్న, మనుషుల ప్రాణాలను హరించే భయంకరమైన మహమ్మారి. చైనా దేశంలోని వుహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ ఆ దేశంతో పాటుగా దాదాపు ప్రపంచ దేశాలన్నింటిలోకి ప్రవేశించింది. చైనాలో ఇప్పటి వరకూ 350 మందికి పైగా మృతి చెందగా..మరో 315 మంది పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇంకా 1500 మందికి పైగా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు.

కరోనా బారిన పడిన వారి కోసం చైనా దేశం ప్రత్యేకంగా 26,900 చదరపు అడుగుల స్థలంలో 1000 పడకల ఆస్పత్రిని 9 రోజుల్లో నిర్మించింది. కరోనా బాధితులకు మామూలుగానే అందరితో పాటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే..అది ఇతరులకు వ్యాప్తి చెంది అంతకంతకూ ప్రబలుతుందన్న ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ 1000 పడకల ఆస్పత్రి. వుహాన్ నగరాన్ని పూర్తిగా నిర్బంధించిన ప్రభుత్వం..సోమవారం నుంచి ఈ ఆస్పత్రిలో రోగులకు చికిత్సలు అందించనున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన ఈ ఆస్పత్రి నిర్వహణ, నిర్మాణం కేవలం 9 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. సాధారణంగా రెండు గదులతో కూడిన ఇంటిని నిర్మించాలంటేనే 3-5 నెలల సమయం పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద ఆస్పత్రిని 9 రోజుల్లో నిర్మించారంటే...అక్కడి ప్రభుత్వం ఎంత టెక్నాలజీని ఉపయోగించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక విషయానికొస్తే...చైనా ఎప్పుడు విపత్తులు ఎదురైనా వాటిని అధిగమించేందుకు, ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుంది.

ఆస్పత్రి నిర్మాణం ఇలా..

పునారావాస కేంద్రాల కోసం ప్రీ ఫ్రాబ్రికేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ ను సిద్ధంగా ఉంచుకుంటుంది. వీటన్నింటినీ ఒక చోట చేర్చి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. అంటే విడి భాగాలతో వాహనాన్ని తయారు చేసినట్లుగానే..ఇళ్లను కూడా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ఆస్పత్రి విషయంలో కూడా అదే పద్ధతిని అవలంబించింది చైనా. ఆ దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కాంక్రీట్ బ్లాక్స్ అన్నింటినీ వుహాన్ కు చేర్చి ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇందులో చైనా ఆర్మీ భాగస్వామ్యం కూడా ఉండటంతో పనులన్నీ చకాచకా పూర్తయ్యాయి.

ఆస్పత్రి నిర్మాణం కోసం చైనాలో అనుభవం కలిగిన ఇంజనీర్లందరినీ ప్రభుత్వం వుహాన్ కు రప్పించింది. మొత్తం 7000 మంది కార్మికులు రాత్రనకా, పగలనకా 24*7 గంటల పాటు ఆస్పత్రి కోసం శ్రమించారు. అలాగే 1000 భారీ యంత్రాలు తోడ్పాటునందించాయి. ఈ ఆస్పత్రిలో మొత్తం 30 ఐసీయూ లతో పాటు 419 వార్డులుండగా, 1400 మంది సీనియర్ వైద్యులు రోగులకు వైద్యం అందించేందుకు అందుబాటులో ఉండనున్నారు. ఈ ఏడాది జనవరి 23వ తేదీన ప్రారంభించిన ఈ ఆస్పత్రి నిర్మాణం ఫిబ్రవరి 2 ఆదివారం ఉదయానికి పూర్తయింది. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఈ ఒక్క ఆస్పత్రే సరిపోదని అంచనా వేసిన చైనా...1600 పడకలతో మరో ఆస్పత్రిని నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

గతంలో సార్స్ వైరస్ వ్యాప్తిచెందినపుడు కూడా చైనా ఇలానే ఒక ఆస్పత్రిని నిర్మించింది. 4000 మంది కార్మికులతో బీజింగ్ శివారులో ఏడు రోజుల్లో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేసింది. కానీ అప్పట్లో ఆస్పత్రి నిర్మాణానికి అయిన ఖర్చును రాబట్టుకునేందుకు ఆ రాష్ర్ట ఉద్యోగులు, ప్రజలకు ఇచ్చే సబ్సిడీల్లో కోత విధించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

Next Story