చిన్నారుల్లో శాపంగా పోషకాహారలోపం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 2:29 PM IST
చిన్నారుల్లో శాపంగా పోషకాహారలోపం

  • లక్ష్యాలను అందుకోని 'పోషణ్ అభియాన్ పథకం'
  • పోషకాహార లోపం, ఎదుగుదల లోపం తగ్గించలేకపోయిన పథకం
  • రక్తహీన వంటి సమస్యలపై దృష్టి పెట్టని 'పోషణ్ అభియాన్'
  • రాజస్థాన్, యూపీ, బీహార్, అసోంల్లో పిల్లల్లో ఎదుగుదల లోపం
  • తెలంగాణలోని పలు జిల్లాల్లో పిల్లలకు సమస్యలు
  • పిల్లలను బాగా చూసుకుంటున్న కేరళ

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన 'పోషణ్ అభియాన్ పథకం' తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి వెయ్యి రోజుల వరకు నవజాత శిసువుల పోషణ పై దృష్టి పెడుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం దేశంలోని పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు సంయుక్తంగా ఓ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 'పోషణ్ అభియాన్‌' తన లక్ష్యాలను తప్పినట్లు తెలుస్తోంది. ఎన్నోరకాల ప్రయత్నాలు చేసినా భారత ప్రభుత్వం దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపం, ఎదుగుదల లోపం, రక్తహీనత వంటి సమస్యలను తొలగించలేక పోతోంది.

పోషకాహార లోపం వల్ల పిల్లలు తమ వయసుకంటే సన్నగా, చిన్నగా కనిపిస్తారు. వారిలో మానసిక, శారీరక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు చదువులో, ఆటల్లోనూ వెనకబడిపోతారు.

రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, అసోం రాష్ట్రాల పిల్లల్లో ఎదుగుదల లోపం ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనంలో తేలింది.

అత్యధిక ఎదుగుదల లోపం యూపీలోని బహరించ్‌ చిన్నారుల్లో ఉంది. అత్యల్ప లోపం ఉన్న ప్రాంతం కొల్లం. తెలంగాణలో ఎదుగుదల లోపం ఎక్కువుగా ఉన్నది ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, జహీరాబాద్. అత్యల్పంగా ఉన్న ప్రాంతం సికింద్రాబాద్.

దేశవ్యాప్తంగా బరువు తక్కువగా ఉన్న చిన్నారులు అత్యధికంగా ఝార్ఖండ్ లోని సింఘంలో ఉన్నారు. అత్యల్పంగా జమ్మూ కశ్మీర్లోని అనంత్ నాగ్ లో ఉన్నారు. తెలంగాణ లో తక్కువ బరువు ఉన్న పిల్లలు అదిలాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ ప్రాంతాల్లో ఉన్నారు.

తక్కువ బరువుతో పుట్టే చిన్నారులు అత్యధికంగా మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్ లో ఉన్నారు. అత్యల్పంగా మిజోరాం లో ఉన్నారు. తక్కువ బరువుతో పుట్టే పిల్లలు తెలంగాణ లో మెదక్, జహీరాబాద్ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నారు

దాద్రా నాగర్ హవేలి లో పిల్లల్లో రక్తహీనత అధికంగా ఉన్నట్టు, కేరళలోని కొల్లం లో అత్యల్పంగా ఉన్నట్టు తేలింది.

1990 సంవత్సరంతో పోలిస్తే 2017లో పిల్లల్లో పొషకాహార లోపం, రక్తహీనత క్రమంగా తగ్గినప్పటికీ, ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉందని అధ్యయనం తేల్చింది.

Next Story