బిగ్ బ్రేకింగ్: భారీ ఎన్‌కౌంటర్.. 17 మంది జవాన్లు మృతి..! 14 మందికి గాయాలు
By సుభాష్ Published on 22 March 2020 4:04 PM ISTఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బస్తర్ - సుకుమా ప్రాంతాల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 14 మంది జవాన్లకు గాయాలు కాగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం మేరకు.. శనివారం మధ్యాహ్నం దాదాపు 400 మంది సీఆర్‌పీఎఫ్ బలగాలు మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా, మావోయిస్టులు భద్రతా బలగాలపై మెరుపు దాడికి దిగారు. అయితే ఈ కాల్పుల్లో 14 మంది వరకు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అలాగే ముందుగా 17 మంది జవాన్లు కనపించకుడా పోవడంతో వారి కోసం బలగాలు గాలింపు చర్యలు చేపడుతుండగా, 17 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.
మావోయిస్టులు తమ ప్రాబల్యం పెంచుకుంటున్న చింతగుపా ప్రాంతంలోని కోర్జాగూడ హల్స్‌లో శనివారం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు ఎదురు కాల్పులకు దిగారు.
కాగా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. భద్రతా దళాలకు చెందిన ఆయుధాలు మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో కొందరు మావోయిస్టులకు కూడా గాయాలైనట్లు సమాచారం. కాగా, మృతి చెందిన 17 మంది జవాన్లలో ఎవరెవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. మృతుల్లో సీఆర్పీఎఫ్‌కు చెందిన ముఖ్య ఉన్నతాధికారులున్నట్లు తెలుస్తోంది.మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.