అమరావతి పై ఐఐటీ చెన్నై బాంబు
By Newsmeter.Network
అమరావతి నుంచి రాజధానికి మార్చడాన్ని ససేమిరా ఒప్పుకోమంటూ టీడీపీ, దాని అనుకూల వర్గాలు రోడ్డెక్కి నినాదాలు, ధర్నాలు చేస్తున్న సమయంలోనే చెన్నై ఐఐటీ సమర్పించిన ఒక అధ్యయన నివేదిక అమరావతి రాజధాని ప్రాంతంలో 70 శాతం వరద ముంపుకు గురయ్యే ప్రాంతమని స్పష్టం చేసింది. ఐఐటీ మద్రాస్ నివేదిక ప్రకారం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో క్రీడా, ప్రభుత్వ, ఆర్ధిక, టూరిజం రంగాలకు చెందిన నిర్మాణాలను చేపట్టరాదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతే కాదు. ఈ రకమైన నిర్మాణాలన్నిటికీ వరద ముంపు ప్రమాదం ఉందని ఐఐటీ చెన్నై చెబుతోంది.
ఈ ప్రాంతాల్లో నేలలో నలభై అడుగుల కింద బండరాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించి, ఆ ఖాళీ ప్రదేశాన్ని మట్టితో పూడ్చేందుకు, వరద ముంపునుంచి తప్పించేందుకు ఎత్తును పెంచేందుకు చాలా ఖర్చు అవుతుందని నివేదిక తెలిపింది. ఇలా అత్యధిక వ్యయంతో నిర్మాణాలు చేపడితే దిగువ భాగంలో ఉన్న లోతట్టు ప్రాంతాలకు మరింత ముప్పు ఏర్పడుతుందని అధ్యయనం లో వెల్లడైంది. రాజధాని కోసం సీ ఆర్ డీ ఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో మూడు నుంచి నాలుగు మీటర్లు ఎత్తును పెంచాలని సూచించారు. దీనికి చాలా ఖర్చవుతుంది. అంతే కాక ఇక్కడ మామూలుగా వేసే రాఫ్ట్ ఫౌండేషన్ కి బదులు పైల్ ఫౌండేషన్ వేయాల్సి ఉంటుంది. రెండున్నర నుంచి అయిదు మీటర్ల లోతునే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నందున రాష్ట్ ఫౌండేషన్ వేయడం సాధ్యం కాదు. కాబట్టి దీని వల్ల ఖర్చులు బాగా పెరుగుతాయి. అందుకనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని ఐఐటీ చెన్నై అధ్యయనంలో వెల్లడైంది
మరో వైపు అమరావతి నుంచి రాజధానికి విశాఖపట్నానికి తరలించడం మంచిదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల వరద ముంపు వంటి సమస్యలుండవని జగన్ ప్రభుత్వం అంచనా. అధికార వికేంద్రీకరణలో భాగంగా కేంద్రీకృత రాజధానికి బదులు మూడు రాజధానులు నిర్మించడం మంచిదని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. న్యాయాలయ రాజధానిగా కర్నూలు, పాలనా పరమైన రాజధానిగా విశాఖపట్నం, శాసనసభ పరమైన రాజధానిగా అమరావతిని ఉంచాలన్నది జగన్ ప్రభుత్వం అభిప్రాయం, ఐఐటీ చెన్నై తాజా నివేదిక జగన్ వాదనకు బలం చేకూరుస్తోంది.