ఇకపై రూ. 5 వేలకు దొరికే చీప్ మొబైల్ ఫోన్లు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. సెల్ ఫోన్ కంపెనీలు ఇకపై తక్కువ ధరకే దొరికే ఫోన్ల ఉత్పాదనను నిలుపు చేయనున్నాయి. కారణం ఏమిటో తెలుసా? దేశంలోని పేదవాడు కూడా అయిదువేల రూపాయల ఫోన్ కొనడానికి ఇష్టపడటం లేదు. పైగా పదివేలు ఆపై ధర ఉన్న ఫోన్ల బాక్సులు, కేసింగ్ లు తయారు చేయడానికి, వాటిని షాపుల వరకూ తీసుకువెళ్లడానికి ఎంత ఖర్చవుతున్నదో చీప్ ఫోన్లకు కూడా అంతే ఖర్చవుతోంది. కాబట్టి వీటిని అమ్మడం వల్ల డీలర్లకు కూడా పెద్దగా లాభాలు మిగలడం లేదు. దాంతో ఈ ఏడాది చివర నుంచి చీప్ ఫోన్లు కనుమరుగు అయిపోతున్నాయి. అయిదువేల రూపాయల ఫోనే కాదు. పదివేల రూపాయల ఫోన్లను కొనేవారి సంఖ్య కూడా తగ్గిపోతోంది.

2019 లో రూ. 5 వేల ఖరీదు ఉన్న ఫోన్ల అమ్మకాలు 45 శాతం పడిపోయాయి. అంతకు ముందు ఏడాది కూడా 2017 అమ్మకాల కన్నా 25 శాతం తక్కువ అమ్మకాలు జరిగాయి. రూ.5వేల ఫోన్ ను బజారులోకి ఇటీవలే విడుదల చేసిన షావోమీ కూడా ఇప్పుడు ఆలోచనలో పడింది. ఇప్పుడు ఫోన్ కంపెనీలు వినియోగదారులకు అనేకానేక ఫీచర్లున్న, వేగంగా పనిచేయగల ఖరీదైన ఫోన్లే కావాలని గుర్తిస్తున్నాయి. తక్కువ ధర ఫోన్ల వాడకంలో మజా లేదని వినియోగదారులు భావిస్తున్నారు. అందుకే నెమ్మదిగా మార్కెట్ పోకడలు మారిపోతున్నాయి. పైగా ఆపిల్, సామ్సంగ్ వంటి కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయడానికి వాయిదాల పద్ధతులు, క్రెడిట్ కార్డులపై వాయిదాలపై చెల్లింపుల వంటి సదుపాయాలు వస్తూండటంతో ప్రజలు హై ఎండ్ ఫోన్లను కొనడానికే మొగ్గు చూపుతున్నారు.

ఎక్కువ ఫీచర్లుండే ఫోన్లే కావాలని కుర్రకారు కూడా కోరుకుంటోంది. కాస్త ధర ఎక్కువైనా ఫరవాలేదు కానీ మంచి ఫోన్ హస్తభూషణంగా ఉండాలనే యువతీ యువకులు కోరుకుంటున్నారు. ఫలితగా తక్కువ ధర ఎంట్రీ లెవెల్ ఫోన్లను కొనేవారే కరువయ్యారు. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఇప్పటికీ ఎంట్రీ లెవెల్ ఫోన్లకు ఎంతో కొంత గిరాకీ ఉందని, అందుకనే పూర్తిగా వాటి తయారీని ఆపాల్సిన అవసరం లేదని భావిస్తున్నాయి. ఏది ఏమైనా నోకియా ఫోన్లు పోయి, సామ్సంగ్ లు వచ్చాయి. ఇప్పుడు సామ్సంగ్ ల స్థానంలో షావోమీలు వచ్చేశాయి. కానీ యాపిల్ వంటి ఫోన్లకు ఉన్న క్రేజ్ మాత్రం మరే పోన్ కీ రావడం లేదు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.