నాలుగోసారి సీఎంగా చౌహాన్‌ ప్రమాణస్వీకారం

By Newsmeter.Network  Published on  24 March 2020 4:49 AM GMT
నాలుగోసారి సీఎంగా చౌహాన్‌ ప్రమాణస్వీకారం

మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం సాయంత్రం నాలుగోసారి సీఎంగా చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లి ఎన్నికలు జరిగిన 15 నెలల్లోపు ఆయన తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ సీఎంగా మూడు విడతలు పనిచేసిన శివరాజ్‌ నాలుగోసారి బాధ్యతలు చేపట్టడం కూడా ఒక రికార్డే. సోమవారం రాత్రి 9గంటలకు రాజ్‌భవ న్‌లో జరిగిన నిరాడంబర కార్యక్రమంలో గవర్నర్‌ లాల్జి టండన్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. వచ్చేవారంలోగా ఆయన తన కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. అంతక ముందు చౌహాన్‌ బీజేపీ శాసనసభా పార్టీ నేతగా ఎన్నికయ్యారు.

చౌహాన్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు సంసిద్ధత వ్యక్తం చేసిన అరగంటకే ప్రమాణం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కమల్‌నాథ్‌, బీజేపీ నాయకురాలు ఉమా భారతిలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే కమల్‌నాథ్‌ సర్కార్‌ 15నెలలకే కుప్పకూలింది. స్వల్ప మెజార్టీతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కమల్‌నాథ్‌.. పార్టీలో అంతర్గత విబేధాలను సమర్థవంతంగా ఎదుర్కోలేక పదవిని త్యజించాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా మరో 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడారు. వీరిలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. దీంతో కమల్‌నాథ్‌ సర్కార్‌ సంక్షోభంలో పడింది. మళ్లి వారిని తిరిగి పార్టీలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.

దీనికితోడు సింధియా అమిత్‌షా, ప్రధాని మోదీ లను కలిసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో బీజేపీలో చేరాడు. దీంతో బీజేపీ అదిష్టానం ఆయన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడటంతో కమల్‌నాథ్‌కు బలపరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. ఆయన బలపరీక్షకు ఆదేశించటంతో అసెంబ్లి ఏర్పాటు చేసిన స్పీకర్‌.. గవర్నర్‌ ప్రసంగం అనంతరం కరోనా ప్రభావంతో అసెంబ్లి సమావేశాలను వాయిదా వేశారు. దీంతో స్పీకర్‌ తీరుపై బీజేపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈనెల 19న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 20వ తేదీ సాయంత్రం నాటికి బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే బలపరీక్షకు కొద్దిగంటల ముందే బలనిరూపనకు సరిపడా ఎమ్మెల్యే సంఖ్య లేకపోవడంతో సీఎంగా ఉన్న కమల్‌నాథ్‌ రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. కాగా సోమవారం చౌహాన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

Next Story