చంద్రయాన్ -3 ప్రయోగం ఎప్పుడంటే..?
By సుభాష్
చంద్రమండలానికి మానవ మిషన్‌ను ఇస్రో చేపట్టే ప్రయత్నాలపై ఇస్రో చీఫ్ కె. శివర్ స్పందించారు. చంద్రయాన్ -3కు శ్రీకారం చుట్టామని, ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. చంద్రమండలానికి మానవ మిషన్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా.. రాబోయే రోజుల్లో చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రయాన్ -3 ల్యాండర్, ఇతర ఖర్చులు దాదాపు రూ. 250 కోట్ల కాగా, లాంచ్‌కు రూ. 350 కోట్ల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఇక చంద్రయాన్ -2 మందిరిగానే చంద్రయాన్-3లోనూ ల్యాండర్, రోవర్, మాడ్యూల్ ఉంటాయని వివరించారు.
దీనిని కూడా చంద్రయాన్-3లో ఉపయోగిస్తాం
చంద్రయాన్ 2లో ఆర్బిటర్ జీవితకాలం 7 సంవత్సరాలు. దీనిని కూడా చంద్రయాన్-3లో ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఇక గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు శిక్షణ నిమిత్తం రష్యాకు పంపనున్నట్లు చెప్పారు. 1984లో రాకేష్ శర్మ రష్యన్ మాడ్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి వ్యోమగాములు దేశీ మాడ్యూల్‌లోనే భారత్ నుంచి వెళ్లనున్నట్లు శివన్ చెప్పారు. ఇక చంద్రయాన్ 2 ప్రయోగం వల్ల చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగ ఖర్చు తక్కువేనని తెలుస్తోంది. ఈ ప్రయోగం ఈ ఏడాది నవంబర్‌లో చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
చంద్రయాన్-2తో ఆత్మవిశ్వాసం కోల్పోని 'ఇస్రో'
ఇక గత ఏడాది చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగం చివరి క్షణంలో నిరాశ పర్చిన విషయం తెలిసిందే. భారత్ మొదటి ప్రయత్నంగా చంద్రయాన్ 2 చేపట్టింది. చంద్రుడి దక్షిణ ద్రువం ఉపరితలంపై దించేందుకు విక్రమ్ ల్యాండర్ ద్వారా ప్రయత్నాలు చేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషన్‌లో సిగ్నల్స్ కట్ కావడంతో సమస్య ఏర్పడింది. నెలరోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ శిథిలాలను నాసా కనుగొంది. కాగా, చంద్రయాన్ 2 పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోయినా ఇస్రో మాత్రం ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలతో ముందుకెళ్తూ చంద్రయాన్ 3 చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.