ఎట్టకేలకు హైదరాబాద్ విమానమెక్కిన చంద్రబాబు
By సుభాష్ Published on 27 Feb 2020 9:43 PM IST
విశాఖలో హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ఐదు గంటలుగా జరిగిన ఉత్కంఠ సద్దుమణిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు హైదరాబాద్ విమానమెక్కేశారు. శాంతి భద్రతల కారణంగా వెనక్కివెళ్లాలని పోలీసుల కోరిక మేరకు ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయం దగ్గరలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు హైదరాబాద్ విమానమెక్కించారు. అయితే ముందుగా చంద్రబాబు విజయవాడకు వెళ్లాలని భావించినా.. విమానాలు లేకపోవడంతో హైదరాబాద్‌కు బయలుదేరారు. చంద్రబాబుతో ఎయిర్ పోర్ట్ వీఐపీ లాంజ్‌లో పోలీసులు చర్చలు జరిపారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లేందుకు అంగీకరించారు. కాగా, ఎన్నిసార్లు అడ్డుకుంటారో చూస్తానని, ఈ రోజుకాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా వస్తానని పోలీసులతో తేల్చి చెప్పారు.
కాగా, ఏపీలో ప్రతిపక్షనేతగా ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది శాంతి భద్రత వైఫల్యం కాదా.. అంటూ మండిపడ్డారు. ఇదంత వైసీపీ ఆడుతున్న నాటకమని దుయ్యబట్టారు.