ఏపీలో ఉద్రిక్తత: డీజీపీ కార్యాలయం ముందు చంద్రబాబు బైఠాయింపు

By సుభాష్  Published on  11 March 2020 3:06 PM GMT
ఏపీలో ఉద్రిక్తత: డీజీపీ కార్యాలయం ముందు చంద్రబాబు బైఠాయింపు

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై జరిగిన దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. దాడిలో గాయపడిన నాయకులతో పాటు దెబ్బతిన్న వాహనాలతో చంద్రబాబు ర్యాలీగా డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాగా, చంద్రబాబుతో పాటు ఇతర నేతలెవరూ లోపలికి రానివ్వకుండా పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసివేశారు.

దీంతో చంద్రబాబు సహా నేతలంతా ద్వారా ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాఆ, చంద్రబాబు వద్దకు అదనపు డీజీ రవిశంకర్‌ వచ్చి చర్చలు జరిపారు. మాచర్లలో జరిగిన దాడి వివరాలను చంద్రబాబు వివరించారు. అలాగే బుద్దా వెంకన్న, బొండా ఉమా తలకు తగిలిన గాయాలను, అలాగే దెబ్బతిన్న వాహనాలను సైతం డీజీకి చూపించారు. చంద్రబాబు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆందోళనను విరమించాలని డీజీ చంద్రబాబును కోరారు.

Next Story
Share it