చేతులారా చంద్రబాబుకు అస్త్రం అందించిన జగన్..!
By Newsmeter.Network Published on 17 Jan 2020 10:40 AM ISTప్రస్తుత ఏపీ రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు బూస్ట్ ఇచ్చారని, జగన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందంటూ రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, 2019 ఎన్నికల తరువాత టీడీపీ డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చినా కేవలం 23 సీట్లకే పరిమితమైంది.
అంతటి ఘోర పరాభవాన్ని టీడీపీతోపాటు అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు సర్వేలు సైతం ఊహించలేదు. అందులోను వైసీపీకి 151 సీట్లు వస్తాయని ఎవరూ అనుకోలేదు. టీడీపీ ఓటమికి కారణాలేంటి..? అన్న విషయాలను ఆఖరకు చంద్రబాబు కూడా గుర్తించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారం కోల్పోయిన టీడీపీ శ్రేణులపై పెద్ద ఎత్తున రాజకీయ దాడులు మొదలయ్యాయి. నరసారావుపేట, ఇతర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చిన ఘటనలే అందుకు ఉదాహరణలు. దాంతో స్వయాన చంద్రబాబు నాయుడే బాధిత గ్రామాలకు వెళ్లి క్యాంపులు పెట్టడం, ఆందోళనలు నిర్వహించడం జరిగింది.
మరోవైపు వైసీపీ, బీజేపీ నుంచి టీడీపీ గెలుపు గుర్రాకుల ఆహ్వానాలు. ఆ క్రమంలోనే చంద్రబాబుకు ఎంతో సన్నిహితంగా ఉండే సుజనా చౌదరి, సీఎం రమేష్ సైతం టీడీపీ వీడారు. ఇలా టీడీపీ శ్రేణులపై రాజకీయంగా, ఎకనామికల్ ప్రెజర్ మొదలైందో అప్పటి నుంచి ఆ పార్టీ కింది స్థాయి కేడర్ కూడా ఆత్మరక్షణలో పడింది. టీడీపీలో ఉండే తమను తాము రక్షించుకోలేమని, బీజేపీలో ఉంటే ప్రొటెక్షన్ ఉంటుందని భావించిన కొందరు పార్టీ నేతలు బీజేపీ పంచన చేశారు.
పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వ విధానాలను తప్పుబడదామన్నా ఆ అవకాశం చంద్రబాబుకు లేకుండా పోయింది. వైసీపీ వాళ్లనే గ్రామ వాలెంటీర్లుగా నియమించారని విమర్శించినా.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలను ప్రజలు గుర్తు చేశారు. కమిటీలను ఏర్పాటు చేసిన చంద్రబాబే చివరకు వాటిని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో జగన్ గ్రామ వాలెంటీర్లపై టీడీపీ చేసిన విమర్శలను ప్రజలు సీరియస్‌గా తీసుకునేందుకు అవకాశం లేకపోయింది.
ఇక జగన్ సర్కార్‌లో ఇసుక మాఫియా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా టీడీపీ హయాంలో ఇసుక కోసం ఏకంగా మహిళా అధికారిపై జరిగిన దాడిని తెరపైకి తీసుకురావడంతో ఆ విమర్శ సైతం ప్రజల ముందు నీరుగారిపోయింది. అలాగే ఇంగ్లీషు మీడియం విషయంలోనూ సీఎం జగన్‌దే అప్పర్ హ్యాండ్. ఆర్థిక మాంద్యం, ఆర్థిక మందగమనం అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామన్నా.. విమర్శల్లో కేంద్ర ప్రభుత్వంపై కూడా మాటలు అనాల్సిన పరిస్థితి. దాంతో 2019 ఎన్నికల నాటి నుంచి మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనకపోగా, జగన్ సర్కార్‌ను అరకొరగా విమర్శిస్తూ వచ్చారు.
సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సైతం విమర్శించేందుకు టీడీపీ సిద్ధమైనా అది విఫల ప్రయత్నమే అయింది. ఇలా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శించడానికి అవకాశాలు లేకపోవడం, ఓటమితో పార్టీ నిర్వీర్యమైపోవడంతోపాటు మరోవైపు బీజేపీ, వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి అంశాలు టీడీపీని ఇరుకున పెట్టాయి. ఆఖరకు టీడీపీకి బలంగా ఉన్న సామాజికవర్గం పునాదుల్ని కదిలించడానికి అటు బీజేపీ, ఇటు వైసీపీ ప్రయత్నాలు చేయడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని చంద్రబాబు ఎలా రన్ చేస్తాడు..? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఇటువంటి చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతుండగా, మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని మందుకు తీసుకొచ్చిన జగన్ నిరాశనిస్పృహల్లో ఉన్న టీడీపీకి బూస్ట్ ఇచ్చేలా పోరాట అస్త్రాన్ని చంద్రబాబు చేతికి ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు పొలిటికల్‌గా ఫుల్‌టైమ్ యాక్టివిటీనిచ్చారని, దీంతో పండుగలకు, సెలవులకు, దూరంగా ఉంటూ ఏకంగా కుటుంబ సమేతంగా రోడ్డుమీదకొచ్చిన చంద్రబాబు సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమంతో నిత్యం ప్రజల్లో ఉండే ఉండే బ్రహ్మాండమైన అస్త్రాన్ని జగన్ ఇచ్చాడు. అందుకే సీఎం జగన్‌కు చంద్రబాబు బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. ఏదేమైనా ఎన్ని ఆరోపణలు వచ్చినా.. నిత్యం ప్రజల్లో ఉండేవారినే ప్రజలు ఆదరిస్తారన్నది జగమెరిగిన సత్యం.