అనుమతిచ్చి..ఆటంకాలు సృష్టించారు : చంద్రబాబు

By రాణి  Published on  28 Feb 2020 6:09 AM GMT
అనుమతిచ్చి..ఆటంకాలు సృష్టించారు : చంద్రబాబు

తాను ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖలో పర్యటించి తీరుతానని స్పష్టం చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. విశాఖలో పర్యటించకుండా తనను ఎన్నిసార్లు ఆపగలుగుతారో చూస్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పోలీసులు విశాఖలో ప్రవర్తించిన తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసి..హై కోర్టుకు వెళ్తామని టీడీపీ తెలిపిన నేపథ్యంలో..విశాఖలో ఉన్న పరిణామాలపై చంద్రబాబు శుక్రవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

విశాఖలో పర్యటించేందుకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి..ఆటంకాలు సృష్టించడం పై ఆయన అసహనం చెందారు. పోలీసుల ప్రవర్తనా తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. వైసీపీ కార్యకర్తలు పోలీసుల సహకారం లేకుండా విమానాశ్రయానికి ఎలా రాగలిగారని ప్రశ్నించారు. తన కాన్వాయ్ పై కోడిగుడ్లు, చెప్పులు, టమాటాలతో దాడి చేసిన వారిపై కేసులెందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ నేతలు దాడులు, ఆందోళన చేసినట్లు పరోక్షంగా స్పష్టమయిందన్నారు.

గురువారం చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించేందుకు అక్కడి ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే..వైసీపీ నేతలు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. సుమారు మూడున్నర గంటల సేపు చంద్రబాబు నాయుడు అక్కడే ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. చేసేది లేక పోలీసులు బలవంతంగా చంద్రబాబు నాయుడిని తిరిగి రిటర్న్ ఫ్లైట్ ఎక్కించారు.

Next Story