సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగారు కదా..అని ప్రజలు జగన్ పై నమ్మకంతో ఓట్లు వేసి..సీఎం కూర్చీనెక్కిస్తే తిరిగి తనను గెలిపించిన వారికే వైసీపీ నరకం చూపిస్తోందని విమర్శించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ పాలనలో రాష్ర్టంలో శరవేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తే..వైసీపీ వచ్చాక అంతే వేగంగా అభివృద్ధి కుంటుపడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్య యాత్రను బుధవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరు నుంచి ప్రారంభించిన బాబు..ప్రజలు, పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరిచి ఆలోచించాలని..రాష్ర్ట ప్రభుత్వం ఎంత దారుణంగా పరిపాలన చేస్తుందో గ్రహించాలని సూచించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ర్ట భవిష్యత్ ను నాశనం చేస్తూ..రేషన్, పింఛన్, నిరుద్యోగ భృతి ఇలా..అన్ని ప్రజా సంక్షేమ పథకాల్లో కోతలు విధించడంపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి రైతుల ఆక్రందనలు వినిపించడం లేదని, ఆత్మహత్యలు కనిపించడం లేదని దుయ్యబట్టారు. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలన్నా ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను పెడితే..ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ..పోలీసులతో దౌర్జన్యంగా కొట్టిస్తోందని, అక్రమంగా కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. జగన్ పాదయాత్ర చేసినపుడు నేను కూడా అలానే చేయించి ఉంటే..ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉండేవాడా అని ప్రశ్నించారు. కియా కార్ల తయారీ సంస్థను బెదిరించడంతో..రిలయన్స్, అదానీ, లాలూ సంస్థలు రాష్ర్టం నుంచి వెనక్కి వెళ్లిపోయాయనన్నారు. పెట్టుబడులు లేకుండా ఉద్యోగాలు రావు..ఉద్యోగాలు లేనపుడు 75 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఇక్కడ ఉద్యోగాలు లేక..చదువుకుని కూలీ చేయలేక..ఉద్యోగం కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన వారిని కూడా వెనక్కి పొమ్మంటున్నారని…ఇందుకు కారణం ఇక్కడ 75 శాతం రిజర్వేషన్లుండటమేనని పేర్కొన్నారు.

రాష్ర్టంలో ఏ ప్రాంత ప్రజలూ..తమకు మూడు రాజధానులు కావాలని కోరలేదు..అలాంటప్పుడు వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి రాష్ర్టంలో అలజడి రేపిందని, రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతల భద్రతను తొలగించిన ప్రభుత్వం..తన భద్రతను కూడా తొలగించేందుకు ప్రయత్నిస్తోందని, తనకు భద్రత లేకపోయినా ప్రజలే తనకు భద్రతగా నిలుస్తారన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.