కరోనా వైరస్ చైనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంటే..ఇక్కడ వైకాపా ఆంధ్రాని అతలాకుతలం చేస్తోందని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు. వైఎస్సార్సీపీ కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ అని, ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే వైసీపీ ఏపీని చెల్లాచెదురు చేసేసిందని వాపోయారు. శనివారం ఆయన వైసీపీ ని విమర్శిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.

” కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తోంది. దానిని మించిపోయింది వైసీపీ వైరస్. ఎనిమిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ను చెల్లాచెదురు చేస్తోంది. ఏపీ అంటేనే ఇన్వెస్టర్లు భయపడి పారిపోతున్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి.

సింగపూర్ కన్సార్షియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్… అన్నీ క్యూ కట్టాయి 8 నెలల్లోనే. ఇది చాలదన్నట్టు అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖ మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట.

ఒక్క కంపెనీని తెచ్చే సమర్ధత లేదు. యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు. అలాంటి మీకు… విశాఖలో లక్షణంగా ఐటి ఉద్యోగాలు చేసుకుంటున్న 18,000 మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా?” అని మండిపడ్డారు.

టీడీపీ నేత నారా లోకేష్ వైఎస్సార్సీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రాష్ర్టంలో వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా..బ్రతికున్న వారిని కూడా ప్రభుత్వ దృష్టిలో చంపేస్తున్నారని ఆవేదన చెందారు.

”ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో! రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారు
@ysjagan గారు. పేద ప్రజల పట్ల ఆయనకి ఉన్న వ్యతిరేకతని పెంచుకుంటూ పోతున్నారు. 7 లక్షల పెన్షన్లు ఎత్తేశారు.

మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తియ్యలేదు అని బుకాయించిన వైకాపా ప్రభుత్వం, రీ వెరిఫికేషన్ పేరుతో కొత్త డ్రామా ఎందుకు మొదలు పెట్టింది ? ఇప్పుడు 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఒప్పింది జగన్ గారు ? ” అని ప్రశ్నించారు.

”మీరు ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు.పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా? పేద వాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకొని ఏం సాధిస్తారు? ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్ గారు సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారు.

చంద్రబాబుగారి హయాంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన సంపద సృష్టి కేంద్రాలు ఇప్పుడు జగనన్న బార్లుగా మారిపోతున్నాయి. నాడు-నేడు అని బిల్డప్ ఇస్తున్న @ysjagan గారు నేడు ఎంత చెత్తగా ఉందో చూడండి. ” అంటూ నాటి కేంద్రాలను జత చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.