ఏపీలో రాజకీయ రగడ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Sep 2019 12:26 PM GMT
ఏపీలో  రాజకీయ రగడ

  • 'చలో ఆత్మకూరు'ను అడ్డుకున్న పోలీసులు
  • చంద్రబాబు సహ టీడీపీ నేతలు గృహనిర్బంధం

అమరావతి: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు నిరసనగా 'చలో ఆత్మకూరు' ర్యాలీకి బయల్దేరుతున్న చంద్రబాబు, టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారని టీడీపీ ఆరోపించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు నారా లోకేష్ సహా పలు తెలుగు దేశం పార్టీ నాయకులను బుధవారం ఉదయం గృహ నిర్బంధంలో ఉంచడంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని టీడీపీ నేతలను గృహనిర్బంధం చేయడాన్ని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఇంటిగేట్ వేశారు. రోడ్డును బారికేడ్లతో మూసేశారు.

ఉదయం తన గుంటూరు నివాసంలో బాబు మీడియాతో మాట్లాడారు.. “ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని, ఈ ప్రభుత్వం ప్రజల మానవ హక్కులను, ప్రాథమిక హక్కులను హరిస్తుందని విమర్శించారు. ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా ఎదురొడ్డి పోరాడుతామన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. తనను 'చలో ఆత్మకూరు' ర్యాలీకి అనుమతించకపోయినా..తరువాతైనా 'చలో ఆత్మకూరు' ర్యాలీ చేపడుతానన్నారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు చంద్రబాబు.

ప్రజాస్వామ్యానికి నేడు చీకటి రోజు. ఒక పక్క వైకాపా గూండాగిరికి నిరాశ్రయులైన వారికి న్యాయం చెయ్యాల్సింది పోయి, ప్రభుత్వ వైఫల్యంపై శాంతియుతంగా నిరసన చేస్తున్న మమ్మల్ని అరెస్టు చేయించి వికృతానందం పొందుతున్నారు. ప్రభుత్వ చేతకానితనానికి ఇది నిదర్శనం. అంటూ నారా లోకేష్ తన ట్విట్టర్లో పోస్ట్స్ చేశారు.

Next Story
Share it