సీఎఫ్‌ఎమ్‌ఎస్ నిజంగానే ఆర్థిక నియంతృత్వ వ్యవస్థకు దారి తీస్తోందా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 5:58 AM GMT
సీఎఫ్‌ఎమ్‌ఎస్ నిజంగానే ఆర్థిక నియంతృత్వ వ్యవస్థకు దారి తీస్తోందా..!

అమరావతి: సీఎఫ్‌ఎమ్‌ఎస్‌... ఇది ఆంద్రప్రదేశ్‌లో ప్రస్థుతం విస్తృతంగా చర్చించబడుతున్న సాఫ్ట్ వేర్ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు, వసూళ్లను ఒక వ్యవస్థీకరమైన పద్దతిలో... పారదర్శకమైన రీతిలో నిర్వహించడానికి ఉద్దేశించబడిన వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ఇపుడు ఎవరికీ కొరుకుడు పడని రీతిలో కేవలం పాలకులు ఇష్టారాజ్యంగా ఆర్థిక వ్యవస్థను మలచడానికి ఉపయోగపడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని విభాగాలపై పెత్తనం చెలాయించడం అనే దాని కన్నా ఆర్థిక నియంతృత్వ ధోరణులకు దారి తీస్తోందనే విమర్శలు ఎక్కువైనాయి.

గతంలో ఆర్థిక శాఖ ఒక సారి బడ్జెట్ విడుదల చేసిన తర్వాత ఆయా విభాగాలు ఆయా నిధులను తమ తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించేవి. ఇందులో వాటికి స్వేఛ్చ ఉండేది. అవసరమైన సందర్భాలలో ఈ నిధుల వినియోగంపై ఆర్థిక శాఖ పర్యవేక్షణ, నియంత్రణ కూడా ఉన్నా...వాటి వినియోగంలో మాత్రం కొంత మేర వివిధ విభాగాలకు స్వేఛ్చ ఉండేది. కానీ ఈ సీఎఫ్‌ఎమ్‌ఎస్ అనే కంప్యూటరైజ్డ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ స్వేఛ్చ పూర్తిగా ఆర్థిక శాఖకు దాఖలు పడిందనే చెప్పవచ్చు. ఆర్థిక శాఖ కార్యదర్శి పెత్తనం లేదా ఇంకా మరో మాటలో చెప్పాలంటే దౌర్జన్యానికి ఇది నాంది పలికిందనే చెప్పవచ్చు.

ఈ సీఎఫ్‌ఎమ్‌ఎస్ వ్యవస్థ ద్వారా ఆర్థిక శాఖ కార్యదర్శి తన ఇష్టానుసారం ఒక విభాగం నిధులను మరొక విభాగం వినియోగానికి ఎవరికీ చెప్పకుండానే బదిలీ చేయవచ్చు... అంటే విభాగాధిపతి అనుమతి లేకుండానే ఆ విభాగానికి మంజూరైన నిధులు ఎవరికీ తెలియకుండా మాయం అయిపోవచ్చు. ఆ తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి కాళ్లు చేతులు పట్టుకోవడం మినహా ఆ విభాగాధిపతి చేయగలిగిందేమీ లేదు.

ఆర్థిక శాఖ చేస్తున్న ఈ దౌర్జన్యాలకు ముఖ్యమంత్రి అధికారాలను అడ్డం పెట్టుకొన్నా...గత ప్రభుత్వ హయాంలో...ఈ ప్రభుత్వ హయాంలో రూపాయి చెల్లింపుకు కూడా ఆర్థిక శాఖ అధికారులను దేబిరించాల్సిన పరిస్థితి ఇతర విభాగాలకు ఏర్పడిందంటే అందులో అతిశయోక్తి లేదు. నిధుల వినియోగంలో పారదర్శకత్వానికి దారి తీయాల్సిన ఈ వ్యవస్థ...ఎలా దుర్వినియోగం అవుతుందో ఇపుడు రాష్ట్రంలో నలుమూలలా చర్చనీయాంశంగా మారింది.

ఇదే జరిగితే....భవిష్యత్తులో కేవలం ముఖ్యమంత్రి కార్యాలయంలో గట్టిగా పట్టున్న వారికి తప్ప నిజాయితీగా పని చేయాలనుకొనే వ్యాపారవేత్తలకు అవకాశం ఉండదు. ప్రతి పనికి ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఆశీర్వాదం అవసరమైతే....రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఎందుకంటే బిల్లుల చెల్లింపుల విషయంలో సీఎఫ్‌ఎమ్‌ఎస్ ఎక్కించడం వరకే మా భాద్యత ఆ తర్వాత ముఖ్యమంత్రి లేదా ఆర్థిక శాఖ దగ్గరకు వెళ్లండి అని విభాగాలు చెబుతున్నపుడు....ప్రతి చెల్లింపు ఆలస్యానికి ముఖ్యమంత్రి నే భాదితులు విమర్శించుకోవడం మొదలు పెడుతారు తప్ప విభాగాధిపతిని కాదు.

ప్రతి విషయంలో పారదర్శకత, అవినీతికి తావియ్యనని చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దీనిపై దృష్టి సారించి త్వరలోనే ఈ వ్యవస్థలో నెలకొన్న ఈ అరాచకత్వానికి ముగింపు పలుకుతారని ఆశిద్దాం.

Next Story
Share it