కర్నాటకలో ని బెంగుళూరు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న సెంటర్ ఫర్ గ్లోబల్ లాంగ్వేజెస్ ఒక థర్మా మీటర్ లాంటిది. ప్రపంచంలో డిమాండ్ ఉన్న దేశానికి చెందిన భాషను చదివేందుకు ఎక్కువమంది నమోదవుతారు. ఆ కోర్సుల్లో చేరతారు. ఆ కోర్సు చదివి ఆ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. సమస్యలు ఉన్న దేశానికి చెందిన భాషను నేర్చుకునేందుకు ఎవరూ ముందుకు రారు. దీన్ని బట్టి ఏ దేశానికి డిమాండ్ ఉందో, ఏ దేశానికి డిమాండ్ తగ్గిందో సులువుగా చెప్పేయొచ్చు.

ఉదాహరణకు 2011 లో జపాన్ ను భూకంపం, సునామీ అతలాకుతలం చేశాయి. ఆ ఏడాది ఒక్క విద్యార్థీ జపానీస్ భాష నేర్చుకునేందుకు నమోదు చేసుకోలేదు. పరిస్థితి కాస్త మామూలు అయిన తరువాత నెమ్మది నెమ్మదిగా మళ్లీ విద్యార్థులు జపానీ లాంగ్వేజ్ కోర్సుల్లో జాయిన్ కావడం మొదలుపెట్టారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి చైనీస్ భాష నేర్పించే కోర్సులకు పట్టింది. కరోనా వ్యాధి వల్ల చైనా అస్తవ్యస్తం అయింది. వేలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. వందలాది మంది చనిపోయారు. ప్రపంచంలో పలు దేశాలు చైనాతో రాకపోకలను నిలిపేసుకున్నాయి. అక్కడ ఉన్న తమ విద్యార్థులను, ఉద్యోగులను స్వదేశాలకు తెచ్చి అక్కడ వారిని పధ్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ చేసి ఉంచాయి. అందుకేనేమో ఈ ఏడాది చైనీస్ భాషను నేర్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఒకటి రెండు మాత్రమే ఎంక్వయిరీలు వచ్చాయి. అందులో ఒక్కరు కూడా కోర్సులో చేరలేదు. కరోనా ప్రకోపం వల్లే చైనా భాషను నేర్చుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చైనీస్ విభాగం ఫ్యాకల్టీలు అంటున్నారు.

మామూలుగా ప్రతి ఏటా పదిహేను ఇరవై మంది విద్యార్థులు చైనా భాష నేర్చుకునేందుకు కోర్సుల్లో చేరతారు. అలాంటిది ఈ ఏడాది ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. మామూలుగా చైనాతో వాణిజ్యం వ్యాపార సంబంధాలు పెంచుకునేవారు, వ్యాపార నిమిత్తం అక్కడ ఉండేవారు ఈ కోర్సుల్లో ఎక్కువగా జాయిన్ అవుతారు. ఐటీ రంగానికి చెందిన వారు కూడా ఈ కోర్సుల్లో చేరడం కనిపించేది. కానీ ప్రస్తుతం కరోనా వల్ల చైనాతో రాకపోకలు ఆగిపోవడంతో ఈ కోర్సుల్లో చేరే వారే కరువయ్యారు. ఈ సెంటర్ లో పలు విదేశీ భాషలను బోధించడం జరుగుతుంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.