తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుశ్‌ గోయల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి కేసీఆర్‌ తొత్తుగా మారారని వ్యాఖ్యనించారు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సూచనల మేరకే ఆయన మెప్పు కోసమే కేసీఆర్‌ మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల కోసమే ముస్లింలకు కేసీఆర్‌ 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్‌ చెబుతున్నారని ఆరోపించారు

1951లో పాకిస్తాన్‌లో 23 శాతం ఉన్న మైనార్టీలు ఇప్పుడు 3 శాతానికి పడిపోయారని అన్నారు. ‘వీరంతా ఎక్కడికెళ్లారు..? అందరూ చచ్చిపోయారా.?లేక ఇస్లాం మతం పుచ్చుకున్నారా..? లేదా వారు మన దేశంలోచొరబడ్డారా..? హింసకు గురైన మన దేశంలోకి వచ్చిన వారికి నీడనిచ్చి పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో మేమున్నాం’ అని గోయల్‌ చెప్పారు. పౌరసత్వ చట్టాన్ని తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అవమానిస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంట్‌ చట్టాలను రాష్ట్రాలు వ్యతిరేకించలేవని సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ కూడా గతంలో చెప్పారని మంత్రి గోయల్‌ గుర్తు చేశారు.

ఇక యూపీఏ హయాంలో తెలంగాణకు 20014-15లో రూ.258 కోట్లు కేటాయిస్తే, ఎన్డీయే హయాంలో 2020-21లో రూ.22,602 కోట్లు ఇచ్చామని అన్నారు. అది గతంలో కంటే పదిరేట్లు ఎక్కువ అని చెప్పుకొచ్చారు.

ఎంఎంటీఎస్‌ కోసం రూ. 500 కోట్లు

కాగా, ఎంఎంటీఎస్‌ కోసం రూ.500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, కానీ రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.