దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలుసైతం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. మరోవైపు వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి పనులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఉపశమనం కలిగించింది. పలు వాహనాల పర్మిట్లు, ఫిట్‌నెస్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లతో పాటు ఇతర డాక్యుమెంట్లు గడువు తీరిపోనుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి వస్తే సీజ్‌ చేస్తారని భయాందోళన చెందుతున్నారు.

Also Read :ఢిల్లి ఘటనతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు

దీంతో నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర అత్యవసర సేవలకు ఉపయోగించే వాహనదారులు తమ డాక్యుమెంట్లు రెన్యూవల్‌కు వెళ్తే కార్యాలయాల్లో లాక్‌డౌన్‌ వల్ల పనులు కావడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులకు కేంద్రం ఉపశమనం కలిగించే వార్తను ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలం ముగిసిపోయే అన్ని వాహనాల పర్మిట్లు, ఫిట్‌నెస్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతో పాటు ఇతర డాక్యుమెంట్లు జూన్‌ 30వరకూ చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. దీంతో ఇప్పటికే గడువు ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు మోటార్‌ వాహన చట్టం కింద వచ్చే అన్ని పత్రాలు జూన్‌ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. కేంద్రం ఈ నిర్ణయం అన్ని రకాల వాహనదారులకు వర్తిస్తుంది. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు పాటించాలని రాష్ట్రాలకు సూచించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్