బిగ్ ట్విస్ట్ : మూడు రాజ‌ధానులు, మండ‌లి ర‌ద్దుపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం..!

By రాణి  Published on  4 Feb 2020 12:58 PM GMT
బిగ్ ట్విస్ట్ : మూడు రాజ‌ధానులు, మండ‌లి ర‌ద్దుపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం..!

ఏపీ మూడు రాజ‌ధానుల అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం తొలిసారిగా కీల‌క వివ‌ర‌ణ ఇచ్చింది. రాజ‌ధాని అంశంపై జోక్యం చేసుకోబోమ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రి మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఈ అంశంపై లోక్‌స‌భ‌లో ప్ర‌శ్న‌లు సంధించారు. ఇందుకు కేంద్ర ప్ర‌భుత్వం లోక్ స‌భ‌లో లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చింది. మూడు రాజ‌ధానుల‌పై సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌క‌ట‌న చేశార‌ని, దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రేమిటి..? అని గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌శ్నించారు. గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌శ్న‌కు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద‌రాయ్ స‌మాధాన‌మిచ్చారు.

రాజ‌ధానుల ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర‌ ప‌రిధిలోని అంశ‌మ‌ని స‌మాధానంలో తేల్చిచెప్పారు. ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, రాజ‌ధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప‌రిధిలోనే ఉంటుంది అని కేంద్ర ప్ర‌భుత్వం త‌న స‌మాధానాన్ని లేఖ‌లో స్ప‌ష్టంగా వివ‌రించింది. రాజ‌ధానిని రాష్ట్ర ప‌రిధిలో ఎక్క‌డైనా ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది.

అయితే, కేంద్రం త‌న స‌మాధానంలో 2015లోనే ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నోటిఫై చేశారు అని చెప్ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తోంది. నిజానికి మొన్న‌టి వ‌ర‌కు భార‌త దేశం మ్యాప్‌లో కూడా అమ‌రావ‌తి పేరును చేర్చ‌లేదు. ఆ త‌రువాత కిష‌న్‌రెడ్డి జోక్యంతో భార‌త చిత్ర‌పటంలోకి అమ‌రావ‌తి చేరింది. అమ‌రావ‌తిని 2015లో ఏపీ రాజ‌ధానిగా నోటిఫై చేశార‌ని కేంద్రం చెబుతూనే రాజ‌ధాని విష‌యంలో కేంద్రం జోక్యం ఉండ‌బోద‌ని, అది పూర్తి రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌న సమాధానంలో తేల్చి చెప్పింది.

మ‌రోవైపు, ప‌లు అంశాల‌పై కేంద్ర ఉన్న‌త వ‌ర్గాలు మీడియాతో ఢిల్లీలో చిట్‌చాట్ నిర్వ‌హించాయి. ఈ సంద‌ర్భంలోనూ ఏపీ శాస‌న మండ‌లి ర‌ద్దు, మూడు రాజ‌ధానుల అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అప్పుడు కూడా కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు మండ‌లి ర‌ద్దు, రాజ‌ధాని ఏర్పాటులో కేంద్ర ప్ర‌భుత్వ జోక్యం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశాయి. ఏపీలో ప్ర‌స్తుతం సుస్థిర ప్ర‌భుత్వం ఏర్పాటైంద‌ని కేంద్ర వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. మొత్తం మీద కేంద్ర ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌పై తొలిసారిగా స్పందించింది. రాజ‌ధాని అంశం రాష్ట్ర ప‌రిధిలోనిదేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో మూడు రాజ‌ధానుల ఏర్పాటును కేంద్ర ప్ర‌భుత్వం అడ్డుకుంటుంది అంటూ తెలుగుదేశం పార్టీ, బీజేపీకి చెందిన సుజ‌నా చౌద‌రి, క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ వంటి వారు చేస్తున్న వాద‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం చెక్‌ పెట్టిన‌ట్ల‌యింది.

Next Story