న్యూయార్క్‌లో మృతదేహాలతో కిక్కిరిసిపోతున్న శ్మశానవాటికలు
By అంజి Published on 4 April 2020 2:04 AM GMTహైదరాబాద్: ప్రపంచాన్ని మహమ్మారి కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. అమెరికా, స్పెయిన్, బ్రిటన్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ దేశాల్లో శుక్రవారం మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు సర్వశక్తల శ్రమిస్తున్నాయి.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10.68 లక్షలు దాటింది. ఇక మృతుల సంఖ్య 52 వేలు దాటింది. అయితే కరోనా వైరస్ రోగుల నిర్దారణ పరీక్షలు విస్తృతంగా అందుబాటులోకి రాకపోవడాన్ని బట్టి చూస్తే వాస్తవ రోగుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
ఇక అమెరికాలో మహమ్మారి తీవ్రస్థాయిలో కోరలు చాచి కూర్చుంది. ముఖ్యంగా న్యూయార్క్‌లో కరోనా బాధితుల సంఖ్య 52 వేలు దాటింది. మృతుల సంఖ్య 1500 దాటింది. దాదాపు 11 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకి అమెరికాలో మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతదేహాల సంఖ్య పెరుగుదలతో ఖననం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
శ్మశనావాటికల వద్ద మృతదేహాలతో రద్దీ పెరిగిపోయింది. దీంతో శ్మశానవాటికల నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. కొందరైతే చేతులెత్తేస్తున్నారు. సాధ్యమైనంత మేర మృతదేహాలను ఆస్పత్రుల్లోనే ఉంచేందుకు ప్రయత్నించాలని బంధువులకు చెబుతున్నారు. బ్రూక్లిన్‌లోని శ్మశానవాటికకు నిన్న ఒక్క రోజే 185 మృతదేహాలు వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండవసారి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. అయితే రెండవ సారి కూడా నెగిటివ్ వచ్చినట్లు వైట్‌హౌస్ డాక్టర్ ఒకరు తెలిపారు. ట్రంప్ కరోనా నిర్దారణ ఫలితం కేవలం 15 నిమిషాల్లోనే వచ్చింది. అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ కీలక దశకు చేరుకుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పోరాటంలో గెలుపోందేందుకు మరో నాలుగు వారాల పాటు అమెరికన్లు ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరారు.
శుక్రవారం స్పెయిన్‌లో 900 మందికిపైగా మృతి చెందారు. బ్రిటన్‌లో 569 మంది చనిపోయారు. జర్మనీ దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య కొంత మేర తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు స్కూళ్లు, ఆఫీస్‌లను మూసివేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.