సీనియర్‌ నటి గీతాంజలి మృతికి ప్రముఖుల సంతాపం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 11:08 AM GMT
సీనియర్‌ నటి గీతాంజలి మృతికి ప్రముఖుల సంతాపం

ప్రముఖ నటి గీతాంజలి మృతి పట్ల సుప్రసిద్ధ కథానాయకులు రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఒక సహనటిగా గీతాంజలి నాకు సుపరిచితురాలు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎన్టీ రామారావు 'సీతారామ కళ్యాణం'తో పరిచయమైన గీతాంజలి హీరోయిన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ నటిగా వందలాది పాత్రల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపుపొందారు.

హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యక్రమాలలో కూడా చాలా ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఆమె మరణంతో నేను వ్యక్తిగతంగా ఒక మంచి స్నేహితురాలిని, చిత్ర పరిశ్రమ ఒక మంచి నటిని కోల్పోయినట్లు అయింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రెబల్ స్టార్ కృష్ణం రాజు అన్నారు.

శ్రీమతి గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలి - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ప్రముఖ నటి గీతాంజలి గారు మరణం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మన తెలుగు సినీ రంగంలోని సీనియర్ నటుల్లో గీతాంజలి గారు ఒకరు. ఆ పేరు చెబితే 'సీతారామ కళ్యాణం'లోని 'శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి...' పాటలోని సీతాదేవి గుర్తుకు వస్తుంది. తెలుగుతోపాటు పలు భాషల్లో నటించిన గీతాంజలి గారు వినోద ప్రధానమైన పాత్రల్లో తనదైన ముద్రను కనబరిచారు. మేము చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి గారికి చెందిన శ్రీనివాస థియేటర్స్ లో వారి కుటుంబ సభ్యులను కలుస్తుండేవాళ్ళం. హైదరాబాద్ వచ్చాక ఆ పరిచయం కొనసాగింది. వారి కుటుంబ సభ్యులకు పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి తెలియ‌చేసారు.

Next Story