”పెళ్లాం చెప్తే వినాలి..మీ కళ్లకి గంతలు వీడాలి..మగువే మగడికి ఆధారం” తొంభైల్లో వచ్చిన ఈ పాట..ఇప్పుడు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే భర్తలకు సరిగ్గా సరిపోతోంది. ఎప్పుడూ ఇంట్లో భార్య వండి వార్చితే తిని ఆఫీసులకెళ్లొచ్చే మగాళ్లకు ఇంటి పని విలువేంటే అర్థమవుతోంది. కరోనా పుణ్యమా అని దేశం 21 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని ప్రధాని ఆదేశించారు. దీంతో ఇంటి పనుల బాధ్యత కాస్తా భర్తలే తీసుకుంటున్నారు. కొందరు తమకు తాముగా ఇంటి పనులు పూనుకుంటే..మరికొందరు భార్యల పోరు పడలేక చేస్తున్నారు.

Also Read : ప్లీజ్..మాకూ భోజనం పెట్టండి..

సామాన్యులే కాదండి..సెలబ్రిటీలు కూడా ఇదే బాట పట్టారు. షూటింగ్ లకు కూడా కరోనా బ్రేక్ ఇవ్వడంతో ఇల్లు ఊడ్చడం నుంచి, వంటా వార్పు, బట్టలు పిండటం, గిన్నెలు కడగడం ఇలా అన్ని పనులూ చేసేస్తున్నారు. అలా చేస్తున్న సెలబ్రిటీల్లో కొందరు వీడియోలు తీసి మీరు కూడా ఇలా ఇంటి పనులు చేయండంటూ స్ఫూర్తి నింపుతున్నారు. తాజాగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ అలీ కూడా తాము ఇళ్లల్లో చేసే పని గురించి చెప్తూ ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేశారు.

‘నేను ఇంట్లో ఏం చేస్తున్నానో తెలిస్తే మీకు మంచి వినోదం అవుతుంది. ఉదయం టిఫిన్‌ నా భార్య చేస్తుంది. మధ్యాహ్నం కూరగాయలు అన్నీ కట్‌ చేసి, నేనే వంట చేస్తున్నా. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్‌. అందుకే ఎక్కువగా అదే చేస్తున్నాను. ‘వద్దండీ.. ఇంటి పని లేకపోతే నాకు బోర్‌ కొడుతోంది, నేను చేస్తా’ అని మా ఆవిడ అంటున్నా కూడా వినకుండా నేనే చేస్తున్నా. బీరకాయ పాలకూర, టమోటా రోటి పచ్చడి..టమోటాలైతే కొనే పనే లేదు. మా పెరట్లో ఉన్న టమోటాలనే కోయడం..వండటం. మగాళ్లు చేయడానికి పని లేదని సాకులు చెప్పకుండా.. మొహమాట పడకుండా మీకు వచ్చిన పని చేయండి’అని రాజేంద్ర ప్రసాద్ సలహాలిస్తున్నారు.

Also Read : ఇప్పుడైనా ‘ నా సినిమా చూడండి’ అంటున్న కాంట్రవర్సీ కింగ్

ఇక కమెడియన్ అలీ కూడా ఇంటి పనిలో నిమగ్నమయ్యారు. ఎప్పుడూ సినిమాలు, షోలు షూటింగుల్లో బిజీగా ఉండే అలీ ఇప్పుడు ఇంటిని శుభ్రం చేస్తున్నారు. ‘రోజూ కార్లు కడుగడం.. ఇంటి పని, కాయగూరలు తరగడం వంటి పనులు చేస్తున్నా. అప్పుడప్పుడు కాసేపు టీవీ చూస్తున్నా. ఇంకా మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా.. వంట పని లాంటివి. నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాణ్ణి.. అందుకని నన్ను బాడుగ (అద్దె) కట్టమనేవాళ్లు కాదు. అప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ణి. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాణ్ణి. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏం మనం స్నానం చేయడం లేదా? వేరే వాళ్లు చేయిస్తున్నారా? చిన్నప్పుడంటే తల్లిదండ్రుల చేయించేవాళ్లు’ అని పేర్కొన్నారు. అంటే నిత్యకృత్యాల్లో భాగంగా మనంతట మనం స్నానం ఎలా చేస్తున్నామో..ఇంటి పనుల్లో కూడా ఆడవాళ్లకు సాయం చేయాలని అలీ చెప్తున్నారన్నమాట.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.