కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ అయింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజూ కూలీ పనులు చేసుకుని జీవితం గడుపుతున్న వారి కడుపుపై కొట్టింది కరోనా. ఇలాంటి సమయంలో ఆకలి చావులుండకూడదన్న మానవతా దృక్పథంతో సినీ హీరోలు, రాజకీయ ప్రముఖులు తమకు తోచినంత విరాళాలను ఇస్తున్నారు.

Also Read : హైదరాబాద్ లో ఇద్దరు డాక్టర్లకు సోకిన కరోనా

తొలుత యువ హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులనందించారు. ఆ తర్వాత రజనీకాంత్, విజయ్ సేతుపతి లు భారీ విరాళాలను ప్రకటించారు. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రూ.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు..మొత్తం రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇప్పుడు చిరంజీవి కూడా సినీ కార్మికులను, దేశంలో పేదరికంతో అల్లాడుతున్న వారిని ఆదుకునేందుకు భారీ విరాళాన్నిప్రకటించారు. షూటింగ్ లు ఆగిపోవడంతో చాలా మంది సినీ కార్మికులు ఉపాధి లేక పస్తులుంటున్నారు. వారికోసం చిరంజీవి పెద్దమనసుతో కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఇక రామ్ చరణ్ కూడా పవణ్ కల్యాణ్ స్ఫూర్తితో కరోనా తో పోరాడుతున్నప్రజలకు సహాయం చేసేందుకు కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధులకు రూ.70 లక్షల విరాళాన్నిస్తున్నట్లు తెలిపారు. గురువారం ట్విట్టర్ లో అడుగుపెట్టిన చెర్రీ..తన సేవా గుణాన్ని చాటుకున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎంతో కష్టపడుతున్న ప్రధాని మోదీ, సీఎంలు జగన్, కేసీఆర్ లకు అభినందనలు తెలిపారు. కరోనా పై ఇండియా గెలుస్తుందని చెర్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లోకి వచ్చాక రామ్ చరణ్ చేసిన ఫస్ట్ ట్వీట్ కూడా ఇదే.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనాను కట్టడి చేసేందుకు తనవంతు సాయంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున విరాళాన్ని అందజేయనున్నట్లు మహేశ్ వెల్లడించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళాన్నిచ్చారు.

సినీ నిర్మాత దిల్ రాజు రెండు రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి రెండు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షల విరాళాన్నిచ్చారు.

Also Read : రెండు వారాల్లోనే భారత్‌లో అతి పెద్ద ఆస్పత్రి రెడీ

తెలంగాణ టీఆర్ఎస్ నేతలు కూడా కరోనాను ఎదుర్కొనేందుకు ముందుకొచ్చారు. లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి లేకుండా ఉన్నవారికి తక్షణ సహాయం అందించేందుకు నేతలంతా కలిసి రూ.500 కోట్ల విరాళాలను అందించనున్నారు. అటు ఏపీలో కూడా రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కడప ఎంపీ సీఎం రమేష్ తనవంతు సాయంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.4.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సహాయనిధులకు రెండేసి కోట్లు, కడప జిల్లా కలెక్టర్ సహాయనిధికి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

తెలంగాణకు భారీగా విరాళాలిచ్చిన కంపెనీలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిత్యావసరాలను అందించేందుకు, ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు వివిధ కంపెనీలు సీఎం కేసీఆర్ కు భారీ విరాళాలను ఇచ్చాయి. మేఘా కంపెనీ అధినేత పీవీ కృష్ణారెడ్డి రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. అలాగే శాంతా బయోటెక్ అధినేత కోటి రూపాయలు, ఎన్ఆర్ఎస్ కన్ స్ట్రక్షన్స్ అధినేత కోటి రూపాయలు, లారస్ ల్యాబ్స్ సీఈఓ రూ.50 లక్షల చెక్కులను సీఎం కు అందజేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.