రూటు మార్చింది.. ఈ లక్షణాలున్నా కరోనానే.. కొత్తగా 6 లక్షణాలు
By సుభాష్ Published on 28 April 2020 4:00 PM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు 200పైగా దేశాలకు విస్తరించింది. ఇక భారత్‌లో కూడా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇక ఇప్పటి వరకూ జ్వరం, దగ్గర, జలుబు లక్షణాలు ఉంటే కరోనాగా అనుమానించేవారు.. కానీ కరోనా కాస్త వేరే రూటు మార్చింది. మరికొన్ని లక్షణాలు ఉంటే కరోనా అని కూడా అనుమానించవచ్చని సెంటర్స్ ఫరర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనంలో తేలింది. వాసన, రుచి గ్రహించే శక్తి కోల్పోవడం, కండరాల నొప్పి, చలి, వణకడం, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నా కరోనా ఉన్నట్లేనని తెలిపింది. ఈ లక్షణాలను సైతం కరోనా జాబితాలో చేర్చారు. కరోనా సోకిన 2 నుంచి 14 రోజుల మధ్య ఈ లక్షణాలు కనిపించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. ఈ లక్షణాలతో ఉండి కరోనా వచ్చిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
అమెరికాలో 14శాతానికిపైగా కరోనా బాధితుల్లో కండరాల నొప్పి ఉన్నట్లు గుర్తించారు. ఇక బ్రిటన్‌లో కరోనా ఉన్న వారిలో రుచి, వాసన గ్రహించే శక్తి కోల్పోవడం లాంటివి గుర్తించారు. దీని ద్వారా మనకు తెలియకుండానే ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉంది.
ఇక కొందరిలో చిన్నపాటి చలి రావడం, జ్వరం వచ్చిన సమయంలో కూడా చలి రావడం చూస్తూనే ఉంటాయి. అలాంటి దానిని తేలికగా కొట్టిపారేయకండి. చలి వస్తుంటే కూడా కరోనా వ్యాధి లక్షణమేనని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తికి చలితో వణకడం, పళ్లు గట్టిగా కొరుకుతూ ఉండటం లక్షణాలు కనిపించాయి. అందుకే మండుటెండల్లో చలితో వణుకుతున్న కరోనా లక్షణాలు ఉండే అవకాశం ఉంది. చలితో వణకడం కరోనాలో ప్రధాన లక్షణమేనని గుర్తించారు. తలనొప్పి, జలుబు, తల తిరుగుతున్నట్లు అనిపించినా కరోనా లక్షణాలు ఉండే అవకాశం ఉంది.
తాజాగా నమోదవుతున్న కరోనా బాధితుల్లో ఈ లక్షణాలు బయటపడ్డాయి. ఇక కరోనా సోకిన వారిలో గొంతు మంట, గొంతు నొప్పితో బాధపడుతున్న వారు 60శాతానికిపైగా ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా కరోనాగా అనుమానించి వైద్యులను సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.