కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..? అయితే ఎంత దూరం వ్యాపిస్తుంది..?

By సుభాష్  Published on  29 Sep 2020 6:41 AM GMT
కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..? అయితే ఎంత దూరం వ్యాపిస్తుంది..?

కరోనా వైరస్‌పై హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. అయితే కరోనాకు ఓ లెక్కంటూ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వాలిపోతుంది. ఎందరినో బలి తీసుకుంటుంది. అయితే ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? ఒక వేళ వ్యాపిస్తే ఎంత దూరం వ్యాపిస్తుంది. గాలి తిరుగుళ్లు తిరుగుతూ వ్యాపిస్తుందా..? అన్న కోణంలో హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించినట్లయితే ఎంత దూరం వరకు విస్తరిస్తుంది.? దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నఅంశాలపై ఎయిర్‌ శాంపిల్‌ సర్వే మొదలు పెట్టారు. ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్వే నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి ఆధునిక ఎయిర్‌ టంప్లరీ యంత్రాన్ని తెప్పించారు. గాలిలో వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలేవి లేవు.

తమ వద్ద ఆధారాలున్నాయి..

అయితే గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయని దాదాపు 200 మందికిపైగా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) కూడా గాలిలో వైరస్‌ వ్యాప్తి ఉండవచ్చన్న ప్రాథమిక నిర్ధారణలతో పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ తరుణంలో సీసీఎంబీ చేపట్టిన తాజా పరిశోధన ఆసక్తికరంగా మారింది. ఆస్పత్రుల పరిసరాల్లో పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల నుంచి వైరస్‌ ఎలా వ్యాప్తిస్తుందన్న అంచనా వేసేందుకు ఈ పరిశోధనలు చేపట్టినట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. కొన్ని రోజుల కిందట ఈ అధ్యయనాన్ని పలు ఆస్పత్రుల్లో ప్రారంభించామని, ప్రధానంగా ఆస్పత్రుల్లోని ఐసీయూ ప్రాంతాల్లో నమూనాలను సేకరిస్తున్నామని ఆయన వెల్లడించారు.

వైరస్‌పై త్వరలో తేలుస్తాం..

ఈ వైరస్‌ ఎన్ని అడుగుల దూరం వరకు గాలిలో వ్యాపిస్తుంది..? ఎంత సేపు మనుగడలో ఉంటుంది..? అన్న విషయాలను త్వరలోనే తేలుస్తామని రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. ఆ తర్వాత జనం గుమిగూడి ఉండే ప్రదేశాల్లోనూ సర్వే నిర్వహిస్తామని, పది రోజుల్లో ప్రాథమిక అవగాహనకు వస్తామన్నారు. అయితే తాము నిర్వహిస్తున్నసర్వేతో వైద్యులు,ఆరోగ్య సిబ్బంది, ఇతర వ్యక్తులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. కొన్ని కారణాల వల్ల సర్వే జరుగుతున్న దవాఖానాల వివరాలను గోప్యంగా ఉంచుతామని రాకేశ్‌మిశ్రా మీడియాతో తెలిపారు.

Next Story