సీఎం హోదాను అడ్డం పెట్టుకునే 'జగన్‌' ఇలా కోరడం సరైంది కాదు

By సుభాష్  Published on  14 Feb 2020 9:05 AM GMT
సీఎం హోదాను అడ్డం పెట్టుకునే జగన్‌ ఇలా కోరడం సరైంది కాదు

సీఎం హోదాను అడ్డం పెట్టుకుని అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ స్పెషల్‌ కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్‌ కోరడం సరికాదని సీబీఐ తేల్చి చెప్పింది. హాజరు మినహాయింపు అనేది ఏ ఒక్క నిందితుడికీ హక్కు కాదని, న్యాయస్థానం విచక్షణ అధికారమని తెలిపింది. నిందితుడి హోదా, ఆర్థిక స్థోమత కోర్టుపై ప్రభావం చూపలేవని స్పష్టం చేసింది. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని తెలిపింది. కాగా, వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ స్పెషల్‌ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.

జగన్‌పై ఉన్న కేసులు తీవ్రమైనవి

ఈ పిటిషన్లను కొట్టివేయాలంటూ సీబీఐ హైదరాబాద్‌ విభాగం ఎస్పీ కల్యాణ్‌ 17 పేజీలతో కూడిన అఫివిడవిట్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌పై ఉన్న కేసులు తీవ్రమైనవని, వీటిలో హాజరు మినహాయింపు ఇవ్వడం సరికాదని, ఒక వేళ మినహాయింపు ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే తీవ్రమైన ఆర్థిక నేరం ఉన్నందున మినహాయింపు ఇవ్వలేమని 2014 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇక 2016లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఇదే అభ్యర్థనతో మరోసారి పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని అదే కోర్టు కొట్టివేసింది. దీనిని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లనుకూడా హైకోర్టు 2017 ఆగస్టు నెలలో కొట్టివేసింది. ఇప్పుడు మళ్లీ సీఎం హోదాలో తాను అధికారిక విధులు నిర్వహించాల్సి ఉందంటూ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను గత ఏడాది నవంబర్‌ 1న సీబీఐ కోర్టు మరోసారి కొట్టివేస్తూ కేసును దర్యాప్తును ప్రారంభించింది.

2012లో చార్జిషీట్‌ దాఖలు చేశాం

ఈ కేసు విషయంలో 2012లో మొదటి చార్జిషీట్‌ దాఖలు చేశామని, 2014లో తుది చార్జిషీట్‌ వేసినట్లు సీబీఐ పేర్కొంటోంది. ఈ కేసుకు సంబంధించి స్పెషల్‌ కోర్టు విచారణ ప్రక్రియలో ఎటువంటి మార్పులేదని సీబీఐ తెలిపింది.

కేసు విచారణ ముందుకు సాగనివ్వకుండా ప్రయత్నాలు

సర్కార్‌ నుంచి లబ్ది పొందేందుకు కొందరు వ్యాపారస్తులు జగన్‌తో మిలాఖతై, తమ కంపెనీలకు లబ్ది పొంది, క్విడ్‌ ప్రొకొ పద్దతిలో ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపణలు గుప్పించింది. జగన్‌ సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేశారని, అన్ని ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ కేసుల్లో నిందితులు విచారణ ముందుకు సాగకుండా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని అడ్డుకుంటున్నారని సీబీఐ చెబుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల 10వ తేదీన ఒకసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారని తెలిపింది. దాదాపు తొమ్మిది నెలల సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద హాజరు మినహాయింపు కోరుతున్నారన్నారు. ఎలాంటి కారణాలు లేకుండా విచారణకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది.

నిందితుడి సమక్షంలోనే కేసు విచారణ జరగాలి

సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 273 ప్రకారం.. నిందితుడి సమక్షంలోనే నేర విచారణ జరగాలని సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొంది. జగన్‌ నిందితులతో కుమ్మక్కై ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించింది. అలాగే దాల్మియా కేసులో పునీత్‌ దాల్మియాకు సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చిందన్న కారణంగా జగన్‌ కూడా మినహాయింపును కోరడం సరికాదని సీబీఐ అభిప్రాయపడింది. కాగా, జగన్‌ 11 చార్జిషీట్లలో మొదటి నిందితుడిగా ఉన్నారని, పునీత్‌తో పొలిస్తే ఆర్థికంగా భారీగా లబ్దిపొందారని, ఈ నేపథ్యంలో జగన్‌ పిటిషన్లను కొట్టివేయండి అంటూ సీబీఐ అభ్యర్థించింది. ఈ పిటిషన్లపై హైకోర్టు ఏప్రిల్‌ 9వ తేదీ వరకు తుది విచారణ చేపట్టనుంది.

Next Story