ఆదానీ ఎంటర్ ప్రైజెస్ మీద సిబిఐ కేసు

By Newsmeter.Network  Published on  16 Jan 2020 4:36 PM GMT
ఆదానీ ఎంటర్ ప్రైజెస్ మీద సిబిఐ కేసు

  • అదానీ ఎంటర్ ప్రైజెస్ మీద కేసు పెట్టిన సిబిఐ
  • ఏపీ జెన్ కోకి బొగ్గు సరఫరా కాంట్రాక్ట్ లో అవకతవకలు
  • భారత ప్రభుత్వ డెప్యూటీ సెక్రటరీ ప్రేమ్ రాజ్ కౌర్ ఫిర్యాదు
  • అదానీ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్టు అభియోగాలు
  • అర్హత లేకపోయినా కాంట్రాక్ట్ ఇచ్చిన ఎన్.సి.సి.ఎఫ్
  • ఉద్దేశపూర్వక కుట్ర, మోసం నేరాలపై కేసు నమోదు
  • మిస్ కండక్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ నేరంపై కేసు నమోదు
  • కాంట్రాక్ట్ ఇచ్చిన దశాబ్దకాలం తర్వాత కేసు పెట్టిన సిబిఐ
  • కేసుకు సంబంధించి సిబిఐ విచారణలో నిగ్గుతేలిన నిజాలు

హైదరాబాద్ : అదానీ ఎంటర్ ప్రైజెస్ మీద, నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ వీరేందర్ సింగ్ మీద, ఎం.డి జి.పి.గుప్త మీద సి.బి.ఐ క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు నమోదు చేసింది. 2010లో ఏపీ జెన్ కోకు బొగ్గును సరఫరా చేసే కాంట్రాక్ట్ కును పొందేందుకు అదానీ కంపెనీ తప్పుడు ధృవపత్రాలన్ని సమర్పించినట్టుగా, కాంట్రాక్ట్ ని చేజిక్కించుకునేందుకు అవకతవకలకు పాల్పడినట్టుగా అభియోగాలు నమోదు చేసింది.

కాంట్రాక్ట్ ను పొందేందుకు అర్హత లేకపోయినా అదాని కంపెనీకే సదరు కాంట్రాక్ట్ ని కట్టబెట్టినట్టు ఎన్.సి.సి.ఎఫ్ మాజీ చైర్మన్ వీరేందర్ సింగ్, ఎం.డి జి.పి.గుప్తాలపై అభియోగాలు నమోదయ్యాయి. ఏపీ జెన్ కోకి బొగ్గును సప్లై చేసేందుకు కాంట్రాక్ట్ టెండర్లు పిలిచి దశాబ్దకాలం పూర్తైన తర్వాత జనవరి 15, 2020న సిబిఐ కేసులు నమోదు చేయడం విశేషం. సెక్షన్ 120-బి రెడ్ విత్ 420 సెక్షన్ కింద ( ఉద్దేశపూర్వకంగా కుట్ర, మోసం చేయడం మరియు క్రిమినల్ మిస్ కండక్ట్ బై పబ్లిక్ సర్వెంట్స్) సిబిఐ ఈ కేసులు పెట్టింది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్యూటీ సెక్రటరీ ప్రేమ్ రాజ్ కౌర్ ఫిర్యాదు మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులు నమోదు చేసింది. దిగుమతి చేసుకున్న బొగ్గును ఏపీ జెన్ కోకు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన కాంట్రాక్ట్ కి సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి.

సిబిఐ విచారణలో ఏం తేలింది..

2010లో విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కి, కడపలోని రాయలసీమ ధర్మల్ పవర్ స్టేషన్ కి 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకున్న బొగ్గును రైలు మార్గం ద్వారా సరఫరా చేసేందుకు ఏపీ జెన్ కో టెండర్లు పిలిచింది. 78 శాతం వాటాను కలిగి ఉన్న ఎన్.సి.సి.ఎఫ్ హైదరాబాద్ శాఖకు కాంట్రాక్ట్ టెండర్ పరిశీలనకోసం వచ్చింది. ఓపెన్ టెండర్లు పిలిచి అందరికీ అవకాశం ఇవ్వాల్సిన ఎన్.సి.సి.ఎఫ్ ఏకపక్షంగా 2.25 శాతం మార్జిన్ తో మెస్సర్స్ మహర్షి బ్రదర్స్ కోల్ లిమిటెడ్ కు నేరుగా కాంట్రాక్ట్ ని ఇచ్చేసింది.

తర్వాత కొద్ది రోజులకే ఎన్.సి.సి.ఎఫ్ ఇదే కాంట్రాక్ట్ కోసం ఓపెన్ టెండర్లను పిలిచి ఆ ప్రపోజల్స్ ని సంబంధిత అధికారులకు పంపినట్టుగా సిబిఐ విచారణలో తేలింది. డ్రాఫ్ట్ టెండర్ నోటీస్ లోనే భారీగా అవకతవకలు జరిగనట్టుగా విచారణలో తేలినట్టుగా సి.బి.ఐ దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొంది.

ఎన్.సి.సి.ఎఫ్ అధికారులు టెండర్లు దాఖలు చేసిన ఆరు కంపెనీల్లో మూడు కంపెనీలకు చెందిన బిడ్ లను టెండర్ నియమాలకు అనుగుణంగా లేవని తిరస్కరించినట్టు, మెస్సర్స్ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు నేరుగా కాంట్రాక్ట్ ని ఇచ్చినట్టుగా సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొంది. అదానీ కంపెనీకి అర్హత లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కాంట్రాక్ట్ ని అప్పగించినట్టుగా సిబిఐ వివరించింది. టెండర్ నోటీసులో పేర్కొన్న రెండు ముఖ్యమైన నిబంధనలను అదానీ కంపెనీ పాటించలేదని సిబిఐ పేర్కొంది.

మెస్సర్స్ వ్యోమ్ ట్రేడ్ లింక్ అదానీ కంపెనీ తరఫున ఏపీ జెన్ కో డీల్ ని దక్కించుకున్న షెల్ కంపెనీ అని సిబిఐ విచారణలో తేలింది. అదానీ కంపెనీ వ్యోమ్ ఎంటర్ ప్రైజెస్ కి 2008-09 సంవత్సరంలో రూ.16.81 కోట్ల అన్ సెక్యూర్డ్ లోన్ ని ఇచ్చినట్టుగా విచారణలో తేలింది. అదానీ గ్రూప్ కి బ్యాంక్ సెక్యూరిటీస్ ఇచ్చిన ఎస్.బి.ఐ బ్యాంక్ శాఖే ఈ డీల్ కి సంబంధించి వ్యోమ్ ఎంటర్ ప్రైజెస్ కి కూడా బ్యాంక్ గ్యారంటీని ఇచ్చినట్టుగా సిబిఐ గుర్తించింది.

సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఎన్.సి.సి.ఎఫ్ అధికారులకూ అదానీ ఎంటర్ ప్రైజెస్ కీ మధ్య జరిగిన లావాదేవీలు బయటపడినట్టు సమాచారం. ఎన్.సి.సి.ఎఫ్ అధికారులు అదానీ కంపెనీతో కుమ్మక్కై ఉద్యేశపూర్వకంగా కాంట్రాక్టును ఆ కంపెనీకి కట్టబెట్టే విధంగా కుట్రకు పాల్పడినట్టుగా సిబిఐ విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది.

Next Story