51 మంది హత్య కేసు.. నేరం ఒప్పుకున్న బ్రెంటన్
By అంజి Published on 26 March 2020 5:05 PM ISTహైదరాబాద్: 'న్యూజీలాండ్ మసీదుల్లో కాల్పుల కేసు: 51 మందిని హత్య చేసిన నేరం అంగీకరించిన బ్రెంటన్' అంటూ బీబీసీ తెలుగు కథనం రాసింది. ఆ కథనం మేరకు గత సంవత్సరం న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో భారీ కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో 51 మందిని హత్య చేసిన నేరాన్ని ఆస్ట్రేలియా పౌరుడు బ్రెంటర్ టరెంట్ అంగీకరించాడు. అంతకు ముందు తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. దీంతో ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కొనసాగింది.
బ్రెంటన్ టరెంన్‌పై ఒక తీవ్రవాదం కేసు, 40 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. క్రైస్ట్‌చర్చ్ నగరంలో జరిగిన దాడులు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ దాడి తర్వాతనే న్యూజీలాండ్‌లో తుపాతీ వినియోగ చట్టాలను మరింత కఠిన తరం చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో న్యూజీలాండ్‌లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో కోర్టు విచారణకు ఆంక్షలు విధించారు. విచారణ సమయంలో బ్రెంటన్, అతడి న్యాయవాది వీడియో లింక్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. బాధిత కుటుంబాల తరఫున మసీదుల ప్రతినిధులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసుకు సంబంధించి కోర్టు ఇంకా ఎలాంటి శిక్ష విధించలేదు.
Also Read: తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్
మసీదుపై జరిగిన దాడిలో ఫరీద్ అహ్మద్ భార్య హుస్నా అల్ తూర్ మృతిచెందారు. “అతడు సరైన దిశలో వెళ్లాలని నేను ప్రార్థిస్తున్నా. తప్పు చేసినట్లు తనకు అనిపించడం సంతోషం. ఇది మంచి ప్రారంభం” అని కాల్పులు జరిపిన బ్రెంటన్ గురించి టీవీఎన్‌జడ్‌తో అన్నారని బీబీసీ తెలుగు తెలిపింది.
క్రైస్ట్‌చర్చ్ నగరంలో 2019 మార్చి 15న బ్రెంటన్ మసీదులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతే కాకుండా తలకు హెడ్ క్యామ్ పెట్టుకొని ఫేసుబుక్ లైవ్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకో మసీదుకు వెళ్లి అక్కడా కాల్పులు జరిపాడు.