హైదరాబాద్‌లో వైద్య విద్యార్థికి కరోనా వైరస్
By Newsmeter.Network Published on 26 Jan 2020 5:46 AM GMT- చైనాలో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్థికి కరోనా వైరస్
- వైద్యవిద్యకోసం చైనాకి వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి
- వూహాన్ లో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్థి
- రోగ లక్షణాలనుబట్టి ప్రత్యేక వైద్య పరీక్షలు
- ప్రత్యేక వైద్య పరీక్షల్లో కరోనా ఉందని నిర్థారణ
- అతని కుటుంబ సభ్యులకూ వైద్య పరీక్షలు
- వైద్యవిద్యకోసం చైనా వెళ్లిన వందలాదిమంది విద్యార్థులు
- చైనాలోని వూహాన్ ప్రాంతంలో విపరీతంగా ఉన్న కరోనా వైరస్
- హైదరాబాద్ కి తిరిగొచ్చినవారందరికీ కరోనా పరీక్షలు
- నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డ్
చైనాలోని వూహాన్ లో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్య పరీక్షల్లో తేలింది. హైదరాబాద్ కి చెందిన ఈ విద్యార్థి చైనాలో చదువుకుంటున్నాడు. తను హైదరాబాద్ వచ్చినప్పుడు జ్వరంతో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి వెళ్లాడు. లక్షణాలను బట్టి అది కరోనా వైరస్ అయ్యుండొచ్చన్న అనుమానంతో వైద్యులు పరీక్షలు చేయించడంతో తనకు కరోనా వైరస్ ఉన్నట్టుగా నిర్థారణ అయ్యింది. జ్వరం తగ్గడంతో సదరు వ్యక్తిని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేశారు.
శుక్రవారం రాత్రికి వచ్చిన వైద్య పరీక్షల ఫలితాల్లో సదరు విద్యార్థి ఎస్.ఎ.ఆర్.ఎస్ కి సంబంధించిన ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నట్టుగా ఫలితాలు వచ్చాయి. తనతోపాటుగా అతని కుటుంబ సభ్యులు ఏడుగురికికూడా కరోనా వైరస్ కి సంబంధించిన వైద్య పరీక్షలు చేసి పరిశీలనలో ఉంచారు.
కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ని ప్రారంభించిన తర్వాత చైనానుంచి వచ్చేవాళ్లందరికీ హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో తప్పనిసరిగా కరోనా వైరస్ కి సంబంధించిన వైద్య పరీక్షలు చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ చెబుతున్నారు.
ఇప్పుడు పరీక్షలు చేసి నిర్థారించిన విద్యార్థిని బేగంపేటలో కనుగొన్నారు. తనకు దగ్గు, జలుబులాంటి లక్షణాలు మాత్రం మొదటిరోజున కనిపించాయి. జ్వరం రాలేదు. లక్షణాలనుబట్టి ట్రీట్మెంట్ ఇస్తూ మొదటి రోజున ఆ వ్యక్తిని ఇంట్లోనే ఉండనిచ్చారు. మూడో రోజున జ్వరం విపరీతంగా రావడంతో తనంతట తానుగా ఆ వ్యక్తి వైద్యంకోసం ఫీవర్ హాస్పిటల్ కి వచ్చి వైద్యుల సలహాపై ఐసోలేటెడ్ వార్డ్ లో అడ్మిట్ అయ్యాడు.
పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీనుంచి రక్తపరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత సదరు వ్యక్తికి కరోనా వైరస్ కి సంబంధించిన ఇన్ ఫెక్షన్ సోకినట్టుగా నిర్థారణ అయ్యింది. శనివారం నాడు మరో విడత చేసిన రక్త పరీక్షల్లో కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ నెగటివ్ రావడంతో అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.
చైనా నుంచి వచ్చిన తర్వాత అతనితో నేరుగా కాంటాక్ట్ లో ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులను వెంటనే ఫీవర్ ఆసుపత్రికి పిలిపించి వాళ్లందరికీకూడా కరోనా వైరస్ ఉందేమో అన్న అనుమానంతో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించి వాళ్లందర్నీ అబ్జర్వేషన్ లో ఉంచారు.
ఫీవర్ హాస్పిటల్లో ఉన్న ఐసోలేషన్ వార్డ్ దాదాపుగా స్వైన్ ఫ్లూ వార్డ్ ని పోలి ఉంటుంది. ఈ వార్డ్ లో కేవలం ఇలాంటి ప్రాంణాంతకమైన వైరస్ సోకిని వారిని మాత్రం ఉంచుతారు. కేవలం గాలి ద్వారా ఇలాంటి వైరస్ ఇతరులకు వేగంగా సోకే ప్రమాదం ఉన్నందున ఈ వార్డ్ లో ఇతర రోగుల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉంచరు.
ఈ ఐసోలేషన్ వార్డ్ లో వైద్య సేవలు అందించే వైద్య నిపుణులకు డిస్పోజబుల్ గౌన్లు, గ్లౌవ్ లు, మాస్క్ లను ఏర్పాటు చేశారు. ఇలాంటి కేసుల్ని హ్యాండిల్ చేసే వైద్యులకు, సిబ్బందికి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలూ తీసుకునే విధంగా శిక్షణ ఇచ్చిన తర్వాతే ఈ వార్డ్ లో సేవలు అందించేందుకు పంపుతారు.
తెలంగాణనుంచి వెళ్లిన వందలాదిమంది విద్యార్థులు చైనాలోని వూహాన్ తో పాటుగా వివిధ నగరాల్లో ఉన్న వైద్య కళాశాలల్లో ఎం.బి.బి.స్ చదువుతున్నారు. ముఖ్యంగా వూహాన్ ప్రాంతంలో కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలినందుకు దాదాపుగా ఇక్కడినుంచి వెళ్లి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.
కానీ అక్కడ చైనాలో ఈ వైరస్ సోకినవారికి ఎలాంటి ట్రీట్మెంట్ , వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్న సంగతి మాత్రం మనకి తెలీదని ఫీవర్ హాస్పిటల్ వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రైవేట్ కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్కడ ఉన్నత విద్యకోసం పంపించే బాధ్యతలను, ఏర్పాట్లను పర్యవేక్షిస్తాయి.
చట్టంలో ఉన్న నియమాల ప్రకారం అవే కన్సల్టెన్సీలు వాళ్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యతనుకూడా స్వీకరించాల్సి ఉంటుంది. కానీ దాదాపుగా ఏ ఒక్క ప్రైవేట్ కన్సల్టెన్సీకూడా దీనిపై శ్రద్ధ వహించడం లేదు. కేవలం విద్యార్థులను అక్కడి యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చేర్చించి చేతులు దులుపుకుంటున్నాయి.
ఒకవేళ విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని కోరినప్పటికీ వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధనను అడ్డం పెట్టుకుని ఎలాంటి సమాచారాన్నీ సదరు కన్సల్టెన్సీలు ఇవ్వడం లేదని తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక అధికారి డాక్టర్ ఎన్.వాణి చెబుతున్నారు. కేవలం ఎవరైనా విద్యార్థులు హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తర్వాత వాళ్లకు ఏవైనా ఆనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మాత్రం వాళ్లు చెప్పిన వివరాలను బట్టి కరోనాలాంటి ప్రాణాంతకమైన వైరస్ కి సంబంధించిన పరీక్షలు జరుపుతున్నారు.