అతని ముక్కు పెద్దగా ఉంది..నాకు ఈ పెళ్లి వద్దు.. వరుడు ఏం చేశాడంటే.!
By సుభాష్ Published on 5 Jan 2020 4:11 PM GMTకోర్టును ఆశ్రయించిన పెళ్లి కొడుకు
యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న కోర్టు
నిశ్చితార్థమై పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఓ యువతి పెళ్లికుమారుడి ముక్కు పెద్దగా ఉందని, పెళ్లి చేసుకోనని వింత కారణం చెప్పి పెళ్లి రద్దు చేసుకున్నఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పైగా ముక్కు సరి చేసుకునేందుకు సర్జరీ చేయించుకోవాలని పెళ్లి కూతురు ఉచిత సలహా ఇచ్చింది. దీంతో పెళ్లి కొడుకు కోర్టును ఆశ్రయించాడు. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరారు. వివరాల్లోకి వెళితే..
సదరు పెళ్లి కుమారుడు రమేష్ (33) బెంగళూరుకు చెందిన వాడు. ఇతను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. మ్యాట్రిమోనీ ద్వారా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. గత సంవత్సరం వీరిద్దరు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడేవారని తెలుస్తోంది. కాగా, గత ఏడాదే ఆగస్టులో ఆమె అమెరికా నుంచి బెంగళూరుకు కాగా, ఇద్దరు కలిసి ఓ స్టార్ హోటల్‌లో కూర్చుని గంటల తరబడి మాట్లాడుకున్నారట. తర్వాత వీరిద్దరి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. అనంతరం పెళ్లి కొడుకు ఆగస్టు 26న తల్లిదండ్రులతో సదరు యువతి ఇంటికి వెళ్లి మాట్లాడగా, సెప్టెంబర్ 9న నిశ్చితార్థం కూడా ఖరారు చేశారు. తర్వాత జనవరి 30 పెళ్లి మూహుర్తాం కూడా ఖరారు చేసేశారు. కాగా, యువతి పెళ్లికొడుకుతో ఓ కండీషన్ పెట్టింది. పెళ్లి మాత్రం తిరుపతిలో జరగాలని తెలిపింది. అయితే తమ బంధువులంతా బెంగళూరులోనే ఉన్నారని, వేదికను ఇక్కడే ఏర్పాటు చేయాలని పెళ్లి కొడుకు కుటుంబీకులు కోరినా అందుకు పెళ్లి కుమార్తె వారు అంగీకరించలేదని తెలుస్తోంది.
దీంతో తప్పని పరిస్థితుల్లో తిరుపతిలోనే పెళ్లికి యువకుడి కుటుంబం అంగీకరించింది. ఇక పెళ్లి కోసం రమేష్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. బంధువుల కోసం 70 గదులను కూడా ముందుగానే బుక్ చేసుకున్నాడు. అందుకు లక్ష రూపాయలు కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట. అలాగే పెళ్లికి సంబంధించిన ఇతర వస్తువుల కోసం రూ.4 లక్షలు కూడా ఖర్చు చేశాడట. ఈక్రమంలోనే ఆ యువతి అమెరికా వెళ్లిపోయిందట. ఇక అక్టోబర్ లో యువతి పెళ్లి కుమారుడి తండ్రికి ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇలా ఎందుకు అని అడిగితే పెళ్లి కుమారుడి ముక్కు పెద్దగా ఉందని, అందుకే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు చెప్పేసరికి పెళ్లి కుమారుడు కుటుంబం షాక్‌కు గురైంది. తర్వాత ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయట్లేదని తెలిసింది. దీంతో చేసేదేమి లేక పెళ్లి కుమారుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది.