కరోనా వైరస్ నుంచి కోలుకున్న కెనడా ప్రధాని భార్య
By Newsmeter.Network
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ వైరస్ భారిన పడి 6,63,749 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ఇప్పటికే 30,300 మంది మృత్యువాత పడ్డారు. కెనడాలోనూ కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది. ఈ వైరస్ భారిన పడి 5,067 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 479 మంది కోలుకోగా, 61 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదిలా ఉంటే వైరస్ సోకిన వారిలో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీ కూడా ఉంది. ఆమె కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందింది. కాగా 16రోజుల చికిత్స అనంతరం గ్రెగొరీ పూర్తిగా కోలుకుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆమె స్వయాన తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
సోఫి గ్రెగొరీ లండన్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వల్ప జ్వరం రావడంతో ఆమెను పరీక్షించిన వైద్యులు మార్చి 12న కరోనా వైరస్ సోకిందని నిర్దారించారు. దీంతో ఆమె అప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఆమెతో పాటు ప్రధాని ట్రూడో వారి పిల్లలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్య కోలుకున్న సందర్భంగా ట్రూడో తన సిబ్బంది, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు కెనడాలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఒంటారియెలో శనివారం ఆంక్షల్ని మరింత కఠినం చేశారు. కెనడాలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఒంటారియె. ఇప్పటి వరకు 50 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్న సమావేశాల్ని నిర్వహించుకోవడానికి అనుమతించిన ప్రభుత్వం.. దాన్ని మరింత కఠినతరం చేసింది. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మికూడవద్దని ఆదేశించింది.
Also Read :భారత్‌లో వెయ్యికి చేరువలో.. కరోనా పాజిటివ్ కేసులు