నిజమెంత: కలొంజీ విత్తనాలు కరోనాను అడ్డుకుంటాయా..!
By సుభాష్ Published on 10 April 2020 1:42 PM ISTకోవిద్-19 వైరస్ కు ఇప్పటిదాకా ప్రత్యేకమైన వ్యాక్సిన్ అన్నది కనిపెట్టలేదు. ప్రపంచ దేశాలు, ఫార్మా కంపెనీలు.. ఇప్పటికే కోవిద్-19కు మందు తయారీ చేయడం కోసం పూనుకున్నాయి. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ను మొదలుపెట్టాయి కొన్ని సంస్థలు. క్లోరోక్విన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ కాంబినేషన్ ను ప్రస్తుతం వైద్యులు కోవిద్-19 పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ కాంబినేషన్ ను ఉపయోగించి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు కోలుకున్నారని చెబుతున్నారు. మరికొందరికి పని చేయడం లేదనే వాదన కూడా ఉంది. ఇక ప్లాస్మా థెరపీ కారణంగా కొందరికి నయం అవ్వడం కూడా కొన్ని చోట్ల జరిగింది.
ఓ వైపు మెడిసిన్ కనుక్కోడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో కలొంజి సీడ్స్(నల్ల జీలకర్ర) వలన కరోనా వైరస్ ను పారద్రోలుతుందని అంటున్నారు. కలొంజి సీడ్స్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అధికంగా ఉంటుందని, పావు టీస్పూన్ కలొంజి సీడ్స్ ను తేనెతో కలిపి తీసుకుంటే కోవిద్-19 ను పారద్రోలవచ్చని చెబుతూ మెసేజీని తీవ్రంగా వైరల్ చేస్తున్నారు.
కొందరు ఫేస్ బుక్ యూజర్లు కోవిద్-19 కు క్లోరోక్విన్ ను ఉపయోగించి చేసిన చికిత్స సక్సెస్ అయ్యిందంటూ ఫాక్స్ న్యూస్ వీడియోను షేర్ చేశారు.
ఇందులో నిజమెంత:
పావు టీస్పూన్ కలొంజి సీడ్స్ ను తేనెతో కలిపి తీసుకుంటే కోవిద్-19 ను పారద్రోలవచ్చని చెబుతూ వస్తున్న మెసేజీ 'పచ్చి అబద్ధం'
క్లోరోక్విన్ లేదా హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వైరస్ బారిన పడ్డ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. దాన్ని వ్యాక్సిన్ గా ముందుగానే వేసుకోవాలని ఎవరూ చెప్పలేదు.. ఏ డాక్టర్ కానీ, ఆరోగ్య సంస్థ కానీ ప్రకటించలేదు. ఇప్పటి వరకూ కరోనా మహమ్మారి కోసం వ్యాక్సిన్ ను కనుక్కోలేదు. పావు టీస్పూన్ కలొంజి సీడ్స్ ను తేనెతో కలిపి తీసుకుంటే కోవిద్-19 ను పారద్రోలడం వీలు కాని పని.. దీని వలన ఎటువంటి ఉపయోగం లేదు.
క్లోరోక్విన్ లేదా హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఎఫ్.డి.ఏ. అప్రూవ్ చేసింది కరోనా వైరస్ సోకిన వాళ్లకు ట్రీట్మెంట్ చేయడానికే.. అది కూడా ఇతర డ్రగ్స్ ను ఉపయోగించి మాత్రమే ట్రీట్మెంట్ ను ఇస్తారు. ఇతర కాంబినేషన్ తో కూడిన డ్రగ్స్ తో పేషేంట్స్ కు చికిత్స అందజేస్తారు. చైనాలోనూ, ఫ్రాన్స్ లోనూ రీసర్చ్ ఇంకా చేస్తూనే ఉన్నారు.. ఇంకా ఎటువంటి నిర్ధారణ కాలేదు.
కలొంజి లేదా నిగెల్లా విత్తనాలను వివిధ చికిత్సలకు వాడుతూ ఉంటారు. చాలా రీసర్చ్ ఆర్టికల్స్ లో కలొంజి సీడ్స్ లో థైమోక్వినోన్ ఉంటుంది అని రాశారు. కానీ ఏ రీసర్చ్ లో కూడా గణనీయమైన సాక్ష్యం అన్నది లేదు.
థైమోక్వినోన్ కెమికల్ ఫార్ములా C10H12O2, హైడ్రాక్సీక్లోరోక్విన్ కెమికల్ ఫార్ములా C18H26ClN3O.. ఈ రెండు కెమికల్స్ కంపోజిషన్ విభిన్నమైనది. మనుషుల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్నదానిపై ఎటువంటి క్లారిటీ లేదు.
క్లోరోక్విన్ లేదా హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్స్ కు మరికొన్ని కాంబినేషన్లు వాడి పేషెంట్స్ కు చికిత్సఅందించగా.. వారు కోలుకున్నారు. కానీ కోవిద్-19ను ముందుగానే అరికట్టే వ్యాక్సిన్ ఏదీ రాలేదు. పావు టీస్పూన్ కలొంజీ సీడ్స్ ను తేనెతో కలిపి తీసుకుంటే కోవిద్-19 ను అరికట్టడం అన్నది "పచ్చి అబద్ధం".