కిట్లొచ్చేస్తున్నాయ్‌.. ఇక ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు..!

By Newsmeter.Network  Published on  4 April 2020 3:25 AM GMT
కిట్లొచ్చేస్తున్నాయ్‌.. ఇక ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు..!

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్‌ గురించే చర్చ. ఉదయం నుంచి సాయంత్రం వరకు అవే వార్తలు. ఈ రోజు ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. ఎంత మంది చనిపోయారు.. ఏ రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్‌ కేసులు.. కుటుంబ సభ్యుల మధ్య చర్చల్లోనూ, ప్రసార మాద్యమాల్లోనూ, సోషల్‌ మీడియాలోనూ ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో చిన్నపాటి దగ్గు వచ్చినా ప్రజలు వణికిపోతున్నారు. జలుబు చేసినా, దగ్గు వచ్చినా, లో జ్వరం వచ్చినా భయాందోళనలతో కరోనా పరీక్షల కోసం ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ వ్యాధి సోకిందో లేదో తెలుసుకోవాలంటే ప్రస్తుతం ఆస్పత్రులు, ల్యాబ్‌ల వద్ద నిరీక్షణ తప్పడం లేదు.

Also Read :కరోనాపై పోరులో.. వైద్యుల రక్షణకు బయోసూట్‌

ఈ నేపథ్యంలో కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి నిమిషాల్లోనే తెలుసుకొనేలా ప్రత్యేక పరీక్షా కిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని బయోనె అనే సంస్థ ఆవిష్కరించింది. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పని చేస్తుంది. జన్యు, సూక్ష్మ జీవుల పరిణామాలకు సంబంధించి పలు పరీక్షలను, పరిశోధనలను సాగిస్తోంది. కాగా ఈ సంస్థ తయారు చేసిన కిట్లకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆమోదం లభించినందని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు. వీటితో నిర్వహించే పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ సరికొత్త పరీక్ష కిట్లను రూపొందించినట్లు, నాణ్యత పరమైన కఠిన పరిశీలనల తర్వాత మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వారు వెల్లడించారు. దీంతో మరికొద్ది రోజుల్లోనే ఇంట్లోనే ఉండి కరోనా వ్యాధి సోకిందా లేదా అని తెలుసుకోవచ్చు

Next Story