వణికిస్తున్న చలిపులి.. తట్టుకోలేక ఆధార్‌కార్డులతో..
By Newsmeter.Network Published on 5 Jan 2020 3:55 AM GMTమేడ్చల్: ఓ వ్యక్తి ఆధార్‌కార్డులకు నిప్పు పెట్టి చలిమంట కాగాడు. ఈ ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నగరంలో చలితీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. కాగా ఓ నిర్జన ప్రదేశంలో ఓ వ్యక్తి ఆధార్‌కార్డులను, బ్యాంక్ చెక్ బుక్కులను, ఉత్తరాలను కాలుస్తూ చలి మంటకాగాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్‌గూడలోని సర్వే నంబర్ 17లోని 7, 8, 17, 18 ప్లాట్లకు సంబంధించి వివాదం జరుగుతోంది. చింతల్‌కు చెందిన బిక్షపతికి, రాంపల్లిదాయరకు చెందిన రామిరెడ్డి రాజిరెడ్డికి గత కొన్ని నెలలుగా ప్లాట్ల విషయమై గొడవలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బిక్షపతి కొన్ని పేపర్లు తీసుకువచ్చి ప్లాట్ల వద్ద కాల్చివేయడాన్ని చూసిన రామిరెడ్డి తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. అప్పటికే కొన్ని ఆధార్‌కార్డులతో ఉన్న సంచులు పూర్తిగా కాలిపోయాయని, మిగతా సంచులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగితాలను ఎందుకు కాల్చివేస్తున్నావని అడిగిన ప్రశ్నకు.. పొంతన లేని సమాధానం చెప్పాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సంచులను పోలీసులు పోస్టల్ అధికారులకు అప్పగించారు. సంచలుల్లో జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి ప్రాంతాలకు చెందిన వారి ఆధార్ కార్డులు, ఇతర కాగితాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తామని కీసర పోలీసులు చెప్పారు.