10 వేల ఒంటెలను చంపేందుకు సిద్ధమైన ప్రభుత్వం

By సుభాష్  Published on  12 Jan 2020 8:49 AM GMT
10 వేల ఒంటెలను చంపేందుకు సిద్ధమైన ప్రభుత్వం

ముఖ్యాంశాలు

  • కార్చిచ్చు వల్ల వేలాది జంతువులు మృతి

  • జనాలను ఇబ్బంది పెడుతున్నాయనే ఒంటెలను చంపేందుకు..

  • ఐదు రోజుల్లోనే 10వేల ఒంటెలను చంపేందుకు అస్ట్రేలియా ప్రభుత్వం రెడీ

కోట్లాది జంతువులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. దానితో పాటు తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. విస్తరిస్తున్న మంటలను ఆర్పడం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు అక్కడ ఇప్పుడు వేసవి కావడంతో నీటి కొరత వెంటాడుతోంది. ఇదే సమయంలో ఎండలకు తాళలేక ఒంటెలు భారీగా నీటిని తాగేస్తున్నాయి. అంతేకాదు దాహంతో ఒంటెలు ఇళ్లలోకి చొరబడి నీటి తొట్లు, డ్రమ్ములు, ఏసీల నుంచి నీరు తాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పంట పొలాలను సైతం నాశనం చేస్తున్నాయి. దీంతో దాదాపు 10 వేల ఒంటెలను హెలికాప్టర్ల ద్వారా చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని ఆస్ట్రేలియన్ ఓ కథనాన్ని వెలువరించింది. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది.

ఒంటెలంటేనే చీడ పురుగుగా భావిస్తున్న అస్ట్రేలియా

అస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఒంటెలను ఒక చీడపురుగుగా పరిగణిస్తోంది. కరువు నెలకొన్న దృష్ట్యా అవి ఆహారం, నీరు కోసం సుదూర ప్రాంతాలకు సంచరిస్తున్నాయని, ఈ క్రమంలోనే మొక్కలను, నీటి వనరులను సర్వనాశనం చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆస్ట్రేలియా చరిత్రలోనే 2019 సంవత్సరం అత్యంత కరువు సంవత్సరంగా నమోదైంది. కొన్ని పట్టణాల్లో కనీసం తాగేందుకు నీరు లేకుండా పోయింది. నీటి కోసం అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఈ మధ్యనే అక్కడ రగులుతున్న కార్చిచ్చు మరింత దారుణ పరిస్థితికి దిగజార్చింది. ఇక దక్షిణ ఆస్ట్రేలియాలోని వాయువ్య ప్రాంతంలో 23వేల మంది ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఓవైపు మంటలు, మరో వైపు ఎండ ఇబ్బంది పెడుతుండటంతో ఒంటెలు కంచెలను దాటుకొని ఇళ్లలోకి చొరబడి మరీ నీటిని తాగేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆస్ట్రేలియన్లు వాపోతున్నారు. అంతే కాదు ఒంటెలు ఏడాదికి ఒక టన్ను కార్బన్‌డైయాక్సైడ్‌తో సమానమైన మీథేన్‌ను విడుదల చేయటం కూడా మరో కారణంగా అధికారులు పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్‌కు మిథేన్ వాయువు ముఖ్య కారణమని తెలిసిందే.

ఐదు రోజుల్లోనే పదివేల ఒంటెలే..

కేవలం 5 రోజుల్లోనే 10 వేల ఒంటెలను చంపబోతున్నారు. ఏపీవై ప్రాంతంలోని ఆదిమ తెగ నాయకుల ఆదేశాల అనంతరం నిపుణులైన సాయుధులు హెలికాఫ్టర్ల ద్వారా నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఒంటెలను మాత్రమే కాల్చి చంపుతారు. ఆ తర్వాత వాటి కళేబరాలను ఆస్ట్రేలియా ప్రభుత్వ తగులబెట్టనుంది. ఐతే ప్రభుత్వ నిర్ణయంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చుతో ఇప్పటికే లక్షలాది అడవి జంతువులు కాలి బూడిదయ్యాయని.. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే ఒంటెలను చంపండం ఎంత వరకు సమంజసమని నిలదీస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతకకుండా కాల్చి చంపడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు.

కార్చిచ్చు వల్ల వేల జంతువులు మృతి

గత నవంబర్ నుంచి ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ప్రబలుతోంది. మంటల కారణంగా 12 మందికిపైగా మరణించగా.. 480 మిలియన్ల జంతువులు చనిపోయాయని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు చెబుతున్నారు. నీరున్నపలు ప్రాంతాల్లో కొన్ని జంతువులు మృతి చెందడంతో ఆ నీరు కలుషితమైందని అధికారులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు 1840 మధ్య ప్రాంతంలో ఒంటెలు తొలిసారిగా దిగుమతి అయ్యాయి. ఆస్ట్రేలియా ఖండనంను అన్వేషించేందుకు ఒంటెలను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆరు దశాబ్దాలుగా ఒక్క భారత్‌ నుంచి 20 వేల ఒంటెలు ఆస్ట్రేలియా దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక్క ఆస్ట్రేలియాలోనే ఒంటెల సంఖ్య అధికంగా ఉంది. కాగా, ఆస్ట్రేలియాలోని ఎడారుల్లో దాదాపు పది లక్షల వరకు ఒంటెలు సంచరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నారు.

Next Story